మణిపూర్‌లో మళ్లీ హింస.. బలగాలను పెంచిన కేంద్రం

మణిపూర్‌లో మళ్లీ హింస.. బలగాలను పెంచిన కేంద్రం

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లు, హింస జరగకుండా ఉండేందుకు అదనంగా 10 కంపెనీల బలగాలను మణిపూర్ రాష్ట్రానికి పంపింది. ఆదివారం (ఆగస్టు 6వ తేదీ) వేకువజామునాటికే అదనపు బలగాలు మణిపూర్‌ చేరుకున్నాయి. అక్కడి నుంచి స్థానిక అధికారుల సూచన మేరకు వివిధ జిల్లాలకు తరలి వెళ్లారు. కేంద్రం పంపించిన బలగాల్లో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ దళాలకు చెందిన వారు ఉన్నారు.

శనివారం (ఆగస్టు 5వ తేదీన) బిష్ణుపూర్‌ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతులను క్వాక్టా ప్రాంతానికి చెందిన మైతేయ్‌ వర్గీయులుగా గుర్తించారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడటంతో శుక్రవారమే (ఆగస్టు 4న) వాళ్లంతా ఇళ్లకు చేరుకున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నవారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనపై మైతేయ్‌ వర్గీయులు కుకీ వర్గానికి చెందిన ఇండ్లకు నిప్పు పెట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలుఉండటంతో కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దించింది.

మే 3న మైతేయ్‌, కుకీ వర్గాల మధ్య తలెత్తిన గొడవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో కేంద్ర రక్షణశాఖ, హోంశాఖ దాదాపు 40 వేల మంది ఆర్మీ, పారామిలటరీ దళాలతోపాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్‌) రాష్ట్రంలో మోహరించింది. మరోవైపు కొన్ని మహిళా సంస్థలు భద్రతా బలగాల కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని సీఏపీఎఫ్‌ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర బలగాలను అడ్డుకునేందుకు తరచూ రోడ్లు బ్లాక్‌ చేస్తున్నారని, అందువల్ల విధినిర్వహణ కష్టమవుతోందని తెలిపింది.