ఎంపీలకు ‘చెత్త’తో భవనాలు

ఎంపీలకు ‘చెత్త’తో భవనాలు

సర్ ఎడ్వర్డ్ ల్యూటెన్స్​ ఢిల్లీలోని 400 ఫ్లాట్లను కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పడగొట్టిన బిల్డింగుల వ్యర్థాలతోనే పార్లమెంటు సభ్యులకు కొత్త భవనాలు కట్టించాలని భావిస్తోంది. రాష్ట్రపతి భవన్​కు ఇరువైపులా ఉన్న నార్త్, సౌత్ అవెన్యూల్లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని దాదాపు 60 ఏళ్ల క్రితం కట్టించారని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్(సీపీడబ్ల్యూడీ) పెద్దాఫీసర్లు చెప్పారు. ఇక్కడి ఫ్లాట్ల కూల్చివేత వల్ల ఏర్పడే చెత్తతో కొత్త ఫ్లాట్లను కడతామని వెల్లడించారు.  ఇటీవలే దాదాపు 80 కోట్ల రూపాయలతో 36 డూప్లెక్స్ ఫ్లాట్లను కట్టింది. వీటిని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కేటాయించనున్నారు. కొత్త ఇళ్లు కట్టడానికి ఇబ్బంది లేకుండా, పాత ఫ్లాట్లను ఒక క్రమపద్ధతిలో కూల్చుతామని సీపీడబ్ల్యూడీ ఆఫీసర్లు వివరించారు. కొత్త బిల్డింగ్స్ ను తక్కువ ఎత్తుతో కడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ పార్కింగ్ తో ఇతర సదుపాయాలు ఉంటాయని, సోలార్ పవర్ తోనే ఇల్లు నడుస్తుందన్నారు. కొత్త లోక్ సభలో 300 మంది ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారు.  వీళ్లలో క్రికెటర్ గౌతమ్ గంభీర్, కేంద్రమంత్రులు రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. వీళ్ల కోసం ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. గతంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నివాసాలు ఇచ్చే వరకూ, ఫైవ్ స్టార్ హోటళ్లలో విడిది ఏర్పాటు చేసేవారు.