ఆస్తి కోసం ఇంటిని కూల్చేసిన బిడ్డలు

ఆస్తి కోసం ఇంటిని కూల్చేసిన బిడ్డలు

కోదాడ, వెలుగు : 75 ఏండ్ల తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలు ఆస్తి కోసం ఆమె ఉంటున్న ఇంటిని కూల్చేశారు. వేధింపులకు గురి చేస్తుండడంతో తల్లడిల్లిన ఆ తల్లి న్యాయం చేయాలంటూ సూర్యాపేట జిల్లా కోదాడలోని బస్టాండ్ సెంటర్​లో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగింది. కోదాడకు చెందిన వెలిదినేని నాగమణికి ముగ్గురు బిడ్డలు. భర్త 24 ఏండ్ల కింద చనిపోయాడు. పెద్ద, నడిపి బిడ్డకు చాలాకాలం కిందటే పెండ్లిళ్లు చేసింది. చిన్న కూతురుకు ఎనిమిదేండ్ల కింద వివాహం జరిపించింది. నాగమణి పేరు మీద కోదాడలో 464 గజాల స్థలం, ఇల్లు ఉంది. తమ పెండ్లిళ్ల టైంలో కట్నం తక్కువగా ఇచ్చిందని, చిన్న బిడ్డకు ఎక్కువగా ఇచ్చిందని పెద్ద, నడిపి బిడ్డలు కోపంతో ఉన్నారు. ఇల్లు ఉన్న స్థలం విలువ రూ. కోట్లలో ఉండడంతో తమ పేరుపై రాయాలని వారితో పాటు అల్లుళ్లు, మనవళ్లు పట్టుబడుతున్నారు. నాగమణికి ఏం జరిగినా చిన్న కూతురే చూసుకునేది. దీంతో ఆమెకు వంద గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేసిచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు కూడా హైదరాబాద్​వెళ్లి చిన్న బిడ్డ దగ్గరే ఉంది. దీంతో అదే టైం అనుకుని ఇద్దరు బిడ్డలు కోదాడలోని ఇంటిని కూలగొట్టారు. విషయం తెలుసుకున్న నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. దీంతో వేచిచూసిన ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో మహిళా సంఘాలను ఆశ్రయించి మంగళవారం ధర్నా చేసింది. మహిళా సంఘం నాయకురాలు అంకతి అనసూర్య, స్వరాజ్యం, పానుగంటి పద్మ, శివ పార్వతి, బలుసు ప్రమీల, ధనలక్ష్మి, సీపీఎం నాయకుడు రాధాకృష్ణ పాల్గొన్నారు.