వజ్రోత్సవ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

వజ్రోత్సవ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తైనా సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 8  నుంచి నిర్వహించిన ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ ముగింపు వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో  ఘనంగా జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఈ వేడుకలో పలువురు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

ముగింపు కార్యక్రమంలో పలువురికి సన్మానం

ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగంతో పాటు రాష్ట్ర సమరయోధులు, ఇటీవల పలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. అదే విధంగా  ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందం ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్ చే ఖవ్వాలి, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ఈ వజ్రోత్సవ ద్విసప్తాహం  సందర్బంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం లేజర్ షో తో పాటు భారీ ఎత్తున  బాణసంచా ప్రదర్శనతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.   

ముగింపు కార్యక్రమానికి 30 వేల మంది వరకు హాజరయ్యే ఛాన్స్

దాదాపు 30 వేలమంది ఈ ముగింపు ఉత్సవాలలో పాల్గొనే విధంగా రాష్ట్ర పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పిటీసీలు తదితర ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవంలో పాలొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.