సర్కార్ సాయానికి ఇంటి జాగా 125 గజాలుండాలె

సర్కార్ సాయానికి ఇంటి జాగా 125 గజాలుండాలె

పట్టణాల్లో 50 గజాలు..

సర్కార్​కు హౌసింగ్, మున్సిపల్ శాఖల రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు : సొంత జాగా ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించే విషయమై హౌసింగ్ డిపార్ట్ మెంట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని మున్సిపల్ డిపార్ట్ మెంట్ కు పంపగా వారు మున్సిపాల్టీలకు సంబంధించి మరికొన్నింటిని కలిపారు. మొత్తం 15 పేజీల రిపోర్ట్​ను ఇటీవల ఈ రెండు శాఖలు సర్కార్​కు అందజేశాయి. త్వరలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి లతో సీఎస్ సోమేశ్ సమావేశంలో వీటిపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. తర్వాత సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో చర్చించి వీటికి ఆమోదం తెలపనున్నారు.

ప్రతిపాదనలు ఇవే
సర్కార్ ఆర్థిక సాయం అందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్టంగా 125 గజాలు, గరిష్టంగా 500 గజాల వరకు ఉండాలని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కనిష్టంగా50 గజాల నుంచి 80 గజాలు ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే ఒక నియోజకవర్గానికి 3వేల ఇండ్లకు సాయం అందించాలన్నారు. ఊర్లలో సొంత జాగా ఉన్న లబ్ధిదారుడు పంచాయతీ సెక్రటరీతో పాటు మరో అధికారి సమక్షంలో.. పట్టణాల్లో మున్సిపల్ ఆఫీసర్ సమక్షంలో ఫొటో దిగి సర్కారు రూపొందించే ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఒక్క నియోజకవర్గానికి 3 వేల ఇండ్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయనుండడంతో ఈ స్కీమ్ ను అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది.