మా ప్లాట్లను కబ్జా చేస్తున్నరని.. బాధితుల ఆందోళన

మా ప్లాట్లను కబ్జా చేస్తున్నరని.. బాధితుల ఆందోళన
  •     రాజేంద్రనగర్​లోని ఊర్జితా ప్రాజెక్ట్ ముందు బాధితుల ఆందోళన
  •     అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించిన పోలీసులు

గండిపేట, వెలుగు : రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్​లోని మానసహిల్స్ సమీపంలో ఉన్న తమ స్థలాలను సీఎం కేసీఆర్ బంధువు కబ్జా చేసి విల్లాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 1995లో మానసహిల్స్ సమీపంలో సాగర్ హిల్స్ సొసైటీ పేరుతో 300 మంది ప్లాట్లను కొన్నారు. అయితే ఆ స్థలాలను సీఎం బంధువు ప్రవీణ్​ రావు ఆక్రమంచి బల్దియా నుంచి పర్మిషన్ పొంది ఊర్జితా ప్రాజెక్ట్ పేరుతో నిర్మాణాలను చేపట్టారని బాధితులు ఆరోపించారు.

దీనిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీసు, రంగారెడ్డి కలెక్టరేట్, ఆర్డీవో, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ.. ఊర్జిత ప్రాజెక్ట్ సంస్థ విల్లా నిర్మాణాలను చేపడుతోందని బాధితులు మండిపడుతున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను ఆపమని అక్కడే బైఠాయించారు.

ధర్నా గురించి సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ వారిని అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు.