
ఘట్కేసర్, వెలుగు: లెక్చరర్ దాడి చేయడంతో మూర్ఛపోయి కిందపడ్డ ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ పరిస్థితి విషమంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడలో టీ స్టాల్ నడుపుతున్న సోమయ్య కుమారుడు మణికుమార్ (16) అన్నోజిగూడ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సరిగ్గా చదవట్లేదని విద్యార్థి తలపై లెక్చరర్ క్రాంతి ఆదివారం పిడి గుద్దులు కొట్టడంతో మూర్ఛపోయి కిందపడ్డాడు. దీంతో కాలేజీ సిబ్బంది బాధితుడిని వెంటనే నీలిమ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి సోమవారం ఫీర్జాదిగూడ స్పార్క్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న కుమారుడిని ఏమైందని తండ్రి అడగ్గా, టీచర్ కొట్టినట్లు పేపర్‌పై రాశారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీకి మొరపెట్టుకున్నాడు. విషయం ఎమ్మెల్సీ వరకు వెళ్లడంతో విద్యార్థికి ఫ్రీగా చదువు చెప్పి, హాస్పిటల్ బిల్లు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లు సోమయ్య తెలిపారు. ప్రస్తుతం మణి పరిస్థితి విషమంగా ఉండగా, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా, విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీ పై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు.