సెక్రటరీలు చెక్కులిచ్చినా ట్రెజరీ ఆఫీసుల్లో పెండింగ్

సెక్రటరీలు చెక్కులిచ్చినా ట్రెజరీ ఆఫీసుల్లో పెండింగ్
  • చేసిన అభివృద్ధి పనులకు బిల్స్ రాక సర్పంచుల తిప్పలు
  • అప్పులు చేసి పనులు చేయించిన సర్పంచులు
  • అప్పులకు వడ్డీలు పెరుగుతున్నా అందని బిల్లులు
  • చాలా గ్రామాల్లో లక్షల్లో నిలిచిపోయిన బిల్లులు
  • ఏడాదిన్నరగా బిల్లుల పెండింగ్ తో సర్పంచుల కష్టాలు
  • పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా రాని జీతాలు
  • సెక్రటరీలు చెక్కులిచ్చినా ట్రెజరరీ ఆఫీసుల్లో పెండింగ్


తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే అయిదారు నెలలుగా బిల్స్ రావడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి చాలా మంది సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉద్యోగుల జీతాలు, కరెంట్ ఛార్జీలు మినహా ఒక్కో పంచాయతీలో బిల్లులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రాక, మళ్లీ ఏమైనా అభివృద్ధి పనులు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు సర్పంచులు.

గ్రామాల్లో జనాభా, కేటగిరీ వారీగా సగటున ఓ పంచాయతీకి లక్షన్నర నుంచి రూ.6 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు కలిపితే లక్షల్లో బిల్లులు నిలిచిపోయాయి. శ్మశాన వాటికలు, పంచాయతీ బిల్డింగ్స్, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్ లోనే ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ రిపేర్ బిల్స్ పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం లేదు. ఎల్ ఈడీ లైట్స్ నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పాలన్న నిర్ణయానికి సర్పంచులు, పాలకవర్గాలు వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. చాలీచాలని జీతాలు అవి కూడా రెండు, మూడు నెలలకోసారి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు కార్మికులు.

రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామాలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. ఇవి పంచాయతీ ఖాతాల్లో కనిపిస్తున్నప్పటికీ, వీటిని నేరుగా వినియోగించకుండా ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీలు చెక్కులు ఇచ్చినా, ట్రెజరరీ ఆఫీసుల్లో నిలిచిపోతున్నాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియడంతో బిల్లుల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. 

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఇనగాలి గ్రామ సర్పంచ్.. ఎస్సీ కాలనీలో నాలుగున్నర లక్షలతో డ్రెయిన్, బీసీ కాలనీలో మూడున్నర లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ బిల్లులు ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మంజూరు కాలేదు. కరీంనగర్  జిల్లా శంకరంపట్నం మండలం అంబాల్ పూర్  గ్రామ సర్పంచ్.. రూ.7 లక్షలు ఖర్చుపెట్టి శ్మశాన వాటిక నిర్మించారు. డబ్బులు రాక ఏడాదిన్నరైంది. కరీంపేటలో రూ.5 లక్షలు ఖర్చుచేసి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి బిల్లులు ఇంకా రాలేదు. కామారెడ్డిలోని ఓ మేజర్  గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు, ఇతర పనులకు ఖర్చు చేసిన రూ.6 లక్షలు ఆరు నెలలగా పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో పెండింగ్ బిల్స్ కోసం సెక్రటరీలు చెక్కులు ఇచ్చినా మార్చి 31 నాటికి క్లియరెన్స్ కాకపోవడంతో అవి రిజెక్ట్ అయ్యాయి. 

నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిర్యాల వెంకన్న చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పాలకవర్గం, కార్మిక సిబ్బందితో కలిసి భిక్షాటన చేశారు. పంచాయతీ కార్మికులతో అనేక పనులు చేయించుకుంటున్నామని, మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.40 లక్షల బిల్లులు 7 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇలా చాలా గ్రామాల్లో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు సర్పంచులు.

 

మరిన్ని వార్తల కోసం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్