అప్పుడేమో ఆగమేఘాల మీద అరెస్ట్.. ఇప్పుడేమో సాక్ష్యాలున్నా సైలెన్స్​

అప్పుడేమో ఆగమేఘాల మీద అరెస్ట్.. ఇప్పుడేమో సాక్ష్యాలున్నా సైలెన్స్​
  • బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో పోలీసుల సూపర్​ స్పీడ్​
  • లాయర్​ దంపతుల మర్డర్​ కేసులో సాక్ష్యాలున్నా డెడ్​ స్లో

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. మొన్నామధ్య హైదరాబాద్​లోని ఓ భూ వివాదానికి సంబంధించిన కిడ్నాప్  కేసు.. నాలుగురోజుల కింద పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్​ దంపతుల హత్య కేసులో ఖాకీల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది.  కిడ్నాప్​ కేసులో.. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. మరి ఇప్పుడు లాయర్ల జంట హత్యలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరనేది ఎందుకు తేల్చట్లేదు? వకీల్ వామన్‌‌రావు రక్తపు మడుగులో ఉన్నప్పుడు తన హత్యకు జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు కారణమని చెప్పినా.. పుట్ట మధును పోలీసులు ఎందుకు టచ్ చేయట్లేదు? కొంచెం అనుమానం ఉంటేనే 41, 61 సీఆర్పీసీల కింద నోటీసులిచ్చి విచారించే ఖాకీలు.. లాయర్ల హత్య కేసులో సాక్ష్యాలున్నా లైట్​తీసుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్​లోని భూ వివాదానికి సంబంధించి బోయిన్‌‌పల్లిలో ప్రవీణ్‌‌రావు అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసి డాక్యుమెంట్స్‌‌పై సంతకాలు పెట్టించారు. ఆ కేసులో నిజానికి గ్రౌండ్‌‌లో కిడ్నాప్‌‌కు పాల్పడింది ముగ్గురు వ్యక్తులు. ఆ వ్యక్తుల్ని అరెస్ట్  చేసిన పోలీసులు స్పాట్‌‌లో లేని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను కూడా అరెస్ట్  చేశారు. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్‌‌రావు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి మధ్య మియాపూర్‌‌కు చెందిన భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌‌రావు సోదరుల కిడ్నాప్​ జరిగింది. దీంట్లో పోలీసులు ఎంక్వైరీ పేరుతో హంగామా చేశారు. అఖిలప్రియను అరెస్టు చేశారు. ఆమెను ప్రధాన నిందితురాలి కింద  ఏ1గా ఎఫ్​ఐఆర్​లో చేర్చారు.  నేరం చేసిన వాళ్లకంటే దానికి మాస్టర్ ప్లాన్ చేసిన వాళ్లే ప్రధాన నిందితులని చెప్పుకొచ్చారు. కిడ్నాప్‌‌కు పాల్పడ్డ నిందితులను ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అఖిలప్రియ భర్త, సోదరుడు సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు. కేసు విచారణ ఎప్పుడూ మీడియాలో లైవ్‌‌గా ఉండేలా ప్రచారం కల్పించారు. కిడ్నాప్‌‌కు గురైన వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడంతో ఈ కేసు విచారణకు అధిక ప్రయార్టీ ఇచ్చారు.

లాయర్​ దంపతుల హత్య కేసులో సైలెన్స్​

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన హైకోర్టు లాయర్లు గట్టు వామన్‌‌రావు, నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర నడిరోడ్డుపై దుండగులు హత్య చేశారు. రామగిరి పోలీస్‌‌ స్టేషన్‌‌కు కిలోమీటర్‌‌ దూరంలోనే హత్యలు జరిగినా స్థానిక పోలీసులు సరిగా స్పందించలేదు. హత్యల గురించి సంఘటన స్థలంలో ఉన్నవాళ్లు పోలీసులకు ఫోన్‌‌ చేసినా చెప్పినా.. నిందితులు హత్యల తర్వాత తమ వాహనంలో పోలీస్‌‌ స్టేషన్‌‌ మార్గంలోనే వెనక్కి వెళ్లిపోయినా వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. నిందితులు సుందిళ్ల బ్యారేజీ వరకు వెళ్లి అక్కడ కత్తులు, బట్టలు మార్చుకొని మహారాష్ట్రకు పారిపోయే వరకు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు.

పుట్ట మధు పేరును వామన్​రావు చెప్పినా..!

నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నప్పుడు వామన్‌‌రావు తన హత్యకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌‌ పుట్ట మధు కారకుడని చెప్పారు. బిట్టు శ్రీనుతో పాటు పుట్ట మధు పేరును ఆయన వెల్లడించారు. అయినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత పుట్ట మధును ఇప్పటివరకు కనీసం పోలీసులు విచారించడానికి కూడా ప్రయత్నించడం లేదు. బోయిన్‌‌పల్లి కిడ్నాప్‌‌ కేసులో నిందితులతో మాట్లాడిందన్న కారణంతో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన పోలీసులు.. వామన్​రావు చనిపోయే ముందు జడ్పీ చైర్మన్‌‌  పుట్ట మధు పేరు చెప్పినా ఆయనను కనీసం విచారించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అడ్వకేట్‌‌ దంపతుల హత్యకు ఉపయోగించిన కత్తులను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒక పండ్ల దుకాణం నుంచి తెచ్చారని తెలుస్తోంది. ఆ కత్తులను జెడ్పీ చైర్మన్‌‌ మేనల్లుడు బిట్టు శ్రీను నిందితులకు ఇచ్చారు. హత్యకు ఉపయోగించిన కారును బిట్టు శ్రీనే సమకూర్చాడు. హత్య తర్వాత నిందితులు పారిపోవడానికి అవసరమైన పరిస్థితులను కూడా అతడే కల్పించాడు. ఇవన్నీ స్థానిక పోలీసులకు తెలిసినా హైదరాబాద్‌‌ నుంచి ఐజీ నాగిరెడ్డి ఘటన స్థలానికి వెళ్లే వరకు బిట్టు శ్రీను పేరు బయటికి రాలేదు. బిట్టు శ్రీను పేరును ఐజీ వెల్లడించిన ఒక రోజు తర్వాత అతడిని అరెస్టు చేశారు.

నాగమణి ఫోన్​ చేస్తే నో రెస్పాన్స్​

ఇటీవల వామన్‌‌రావు భార్య నాగమణి పెద్దపల్లి డీసీపీకి ఫోన్‌‌ చేసి కంప్లయింట్​ఇచ్చినా పోలీసులు లైట్‌‌ తీసుకున్నారు. గుంజపడుగులోని రామాలయంలోకి జనాన్ని వేసుకొని వచ్చి కుంట శ్రీను బీభత్సం చేస్తున్నాడని, ఐదుసార్లు డయల్‌‌ 100కు ఫోన్‌‌ చేసినా పట్టించుకోలేదని ఆమె కంప్లయింట్​లో పేర్కొన్నారు. ఎవరినైనా చంపినా పట్టించుకోరా అని డీసీసీని ఆమె ప్రశ్నించారు. గుడి విషయంలో సర్పంచ్‌‌ గ్రామ సభ పెట్టుకుంటామంటే రక్షణ కల్పిస్తామని మాత్రమే డీసీపీ హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ నెల 17న హైదరాబాద్‌‌ నుంచి మంథనికి వచ్చిన వామన్‌‌రావు, నాగమణి దంపతులను తిరుగు ప్రయాణంలో దుండగులు హత్య చేశారు.

కోర్టు సీరియస్​ అయినా అంతంతే!

కిడ్నాప్‌‌ కేసులో అఖిలప్రియ అరెస్టు విషయంలో ఉత్సాహం చూపించిన పోలీసులు, అడ్వకేట్‌‌ దంపతుల కేసులో హైకోర్టు సీరియస్‌‌ అయినా సరైన రీతిలో విచారణ జరపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులకు గ్రౌండ్‌‌ లెవల్‌‌లో ఉన్న పోలీసులు అన్ని విధాలా సహకరించారనే చర్చ జరుగుతున్నా, హత్య విషయంలో పోలీసు ఆఫీసర్ల  నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. కేసును హైదరాబాద్‌‌ నుంచి ఉన్నతాధికారులు మానిటరింగ్‌‌ చేస్తున్నా మని చెప్తున్నా, విచారణ కోసం ఐజీ స్థాయి అధికారిని రంగంలోకి దించినా.. అన్ని వేళ్లు పోలీసుల వైపే చూపిస్తున్నా యి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు అధికార పార్టీ నేతలు కావడంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఆడియో టేపులు వచ్చినా స్పందించట్లే!

వామన్‌‌రావు దంపతుల హత్యకు కేవలం ఊరిలోని వివాదాలే కారణమన్న కోణంలోనే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వామన్​రావు తండ్రి తన కొడుకు, కోడలు హత్యకు జడ్పీ చైర్మన్​ పుట్ట మధు కారణమని ఆరోపించినా, రాజకీయ కారణాలతోనే చంపేశారని చెప్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. పుట్ట మధు ఆస్తులపై మంథనికి చెందిన ఇనుముల సతీశ్‌‌ హైకోర్టులో కేసు వేయగా వామన్‌‌రావు దంపతులు ఆ కేసును వాదించారు. సతీశ్‌‌ను హతమార్చేందుకు కుంట శ్రీను సుపారీ గ్యాంగ్‌‌తో రూ. 60 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకునే ఆడియో టేపు బయటికి వచ్చినా దానిపై పోలీసులు కిమ్మనడం లేదు. పుట్ట మధు అనుచరులు తనతోపాటు నలుగురిని చంపాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారని, వామన్‌‌రావును చంపేశారని సతీశ్‌‌ మీడియా ముందు చెప్పినా పోలీసుల్లో చలనం లేదు. వామన్‌‌రావు దంపతుల హత్యకు ముందు బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనుతో 25 సార్లు ఫోన్‌‌లో మాట్లాడినట్టు కాల్‌‌ లిస్టును బట్టి తేలిందని సమాచారం. హత్యకు కొన్ని గంటల ముందు వరకు కుంట శ్రీను జడ్పీ చైర్మన్‌‌ పుట్ట మధుతోనే కలిసి ఉన్నాడు. హత్య తర్వాత బిట్టు శ్రీను జడ్పీ చైర్మన్‌‌ను కలిసినట్టుగా ఆరోపణలున్నాయి. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా కనిపించడం లేదని తెలుస్తోంది.