ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్

ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు పరేషాన్ చేస్తున్నాయి. ఓటములతో పాటు నేతల మధ్య విభేదాలతో సీనియర్ నేతలు కలవరపడ్తున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండడంతో పార్టీని గాడిన పెట్టే మార్గాలు అన్వేషిస్తున్నారు.వరుస ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదు. 2018 నుండి జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ వెనుకపడ్తూనే ఉంది. దుబ్బాక, హుజురాబాద్ తోపాటు మునుగోడు బై పోల్ లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. ఇలా వరుస ఓటములతో కాంగ్రెస్ లీడర్లు కుంగిపోతున్నారు. 

 ఒకవైపు ఘోర ఓటములు పరేషాన్ చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేతల తీరు పార్టీని మరింత బలహీన పరుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం.. రోజుకో రచ్చ తెరమీదకు రావడం.. పార్టీ మనుగడకే ప్రమాదంగా మారింది. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుండి నడపాల్సిన నేతలే ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీనితో సీనియర్ నేతలు, క్యాడర్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని వీడే వారే కానీ.. పార్టీలోకి వచ్చే వారే కరువయ్యారు. నేతల మధ్య విభేదాలు, గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ లో చేరడానికి ఎవరు ముందుకు రావడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలోకి వచ్చిన నేతలు కూడా ఎక్కువ కాలం ఉండడం లేదు. చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న వాళ్లు కూడా వరుస ఓటములు చూసి సైలెంట్ అవుతున్నారు. దీంతో సీనియర్ నేతల్లో అంతర్మధనం మొదలైంది. వరుస ఓటములకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రజల్లో తిరిగి కాంగ్రెస్ పై విశ్వాసం కలిగేలా పనిచేయాలని డిసైడయ్యారు. నిరంతరం ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం, గ్రౌండ్ లెవల్ లో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని కాంగ్రెస్ నేతలు డిసైడయ్యారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి. మునుగోడు ఉప ఎన్నికల ఫలితంతో నిరాశ చెందవద్దని కార్యకర్తలకు సూచించారు. రాహుల్ పాదయాత్ర ద్వారా పార్టీకి జోష్ వచ్చిందని,  వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మల్లు రవి. ఉప ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం లేదని, జనరల్ ఎలక్షన్ పైనే తమ ఫోకస్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు.