బోధన్​లో ఇరు వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

 బోధన్​లో ఇరు వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

బోధన్, వెలుగు: బోధన్​లో శివాజీ విగ్రహ ఏర్పాటు విషయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న లొల్లి సమసిపోయింది. శివాజీ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఒక వర్గం స్పష్టం చేయడంతో ఉద్రిక్తత చల్లారింది. ఈ విషయమై ఇరువర్గాలపెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన ఆఫీసులో రెండు మతాలకు చెందిన పెద్దలు, ఆల్​ పార్టీ లీడర్లు, కులపెద్దలతో ఏసీపీ  ఎన్.రామారావు  మీటింగ్​ నిర్వహించారు.

ఎమ్మెల్యే షకీల్ వచ్చిన తర్వాత ఏ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలనే విషయంపై అన్ని వర్గాలకు చెందిన నాయకులు, మత పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక నుంచి గొడవలు పడకుండా కలిసి ఉంటామని హామీ ఇచ్చారని ఆర్డీఓ తెలిపారు. సోషల్​ మీడియాలో కొంతమంది అనవసర పోస్టులు పెట్టి గందరగోళం సృష్టిస్తున్నారని వారిపై కేసులు నమోదు చేస్తామని  తెలిపారు. ఇప్పటికే ఎడపల్లి మండలానికి చెందిన ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.