
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో ఆదివారం (ఆగస్టు 24) సేవ్ కాన్స్టిట్యూషన్-సేవ్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రిజర్వేషన్ ఫలాలు పొందిన యువత, ఉద్యోగులు కమ్యూనిటీ డెవలప్ మెంట్ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలా మంది ఉద్యోగాలు పొది పెద్ద పెద్ద పొజిషన్ కు చేరుకున్నాక.. జాతిని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు, కమ్యూనిటీ చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో సైలెంట్ గా ఉండిపోయి.. తమ జాతులకు సహాయం చేయకుండా ఉండిపోతున్నారని అన్నారు. అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు సోషల్ జస్టిస్ కోసం మరింత ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితాన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు మంత్రి వివేక్. అంబేద్కర్ ఎన్నో త్యాగాలు చేశారని.. 23 డిగ్రీలు చేశారని కొనియాడారు. ప్రతి విషయంపైన
చాలా స్పష్టంతతో ఉండేవారని కొనియాడారు. కుటుంబాన్ని పక్కన పెట్టి జాతికోసం పనిచేశారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది
అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తాము చాలా గ్రామాలలో విగ్రహాలు పెట్టించడం జరిగిందని.. విగ్రహాన్ని చూసినప్పుడైనా ఆయన ఆశయాలు, ఆలోచన విధానం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన కలగాలనేదే లక్ష్యం అని చెప్పారు. రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఎలా కష్టపడ్డారో.. ఎలా ఎదిగారో విగ్రహాన్ని చూసి నేర్చుకుంటారని అన్నారు.
రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ ఒక్కరే లీడ్ తీసుకుని అన్ని వర్గాలకు న్యాయం చేశారని.. అణచి వేయబడిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ భద్రత కల్పించారని అన్నారు. భారత రాజ్యాంగం అంత పటిష్టంగా ఉందంటే దానికి అంబేద్కర్ కృషి అని కొనియాడారు. కుల వివక్ష వలన ఎస్సీ, ఎస్టీలకు సమాజంలో మోటివేషన్ మోటివేషన్ లేదని.. సహకారం లేదే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు తీసుకొచ్చార అన్నారు. ఎంతో ముందు చూపుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించారని, కనీస వేతనాలు, 8 గంటలే పని మొదలైన సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు.
బాబాసాహెబ్ మార్గంలో విద్యాసంస్థలు స్థాపించి సేవ చేస్తున్నామని.. డొనేషన్లు తీసుకోకుండా విద్యార్థులను చదివిస్తున్నామని చెప్పారు మంత్రి. తమ విద్యా సంస్థల్లో 70 శాతం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు.. పేదవాళ్లు, కూలీ వాళ్లు, ఆటోడ్రైవర్ల పిల్లలు చదువుతున్నారని.. ఎలాంటి లాభం ఆశించకుండా నడుపుతున్నట్లు తెలిపారు. 80 శాతం మార్కులు వస్తే ఫీజు లేకుండా విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆలిండియాలో అంబేద్కర్ లా కాలేజ్ 5వ స్థానంలో వచ్చిందని గుర్తు చేశారు. లా కాలేజీ నుంచి 8 మంది జడ్జీలు అయ్యారని తెలిపారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి స్థాపించిన విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ బేగంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ/ఎస్టీ ఫెడరేషన్, ఆల్ డిఫెన్స్ ఎస్టాబ్లిస్మెంట్స్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంస్థలు ఈ సంయుక్తంగా కాన్ఫరెన్స్ లు నిర్వహించాయి. ఈ కాన్ఫరెన్స్ లో ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ, మైనారిటీస్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.