పల్లీల వ్యాపారి నుంచి ఐదుగురికి కరోనా

పల్లీల వ్యాపారి నుంచి ఐదుగురికి కరోనా

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​ అని తేలింది. ఇందులో ఐదుగురు గ్రేటర్ హైదరాబాద్‌‌కు చెందినవారు, మరొకరు రంగారెడ్డికి చెందినవారు. గ్రేటర్​లోని ఐదుగురికి పల్లీల వ్యాపారి ద్వారా వైరస్​ సోకింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 1044కు చేరింది. ఇందులో 442 మంది ఇప్పటికే కోలుకోగా.. శుక్రవారం మరో 22 మందిని హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 464కు చేరింది. మరో 552 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మొత్తం 28 మంది మరణించారు.

మలక్​పేట్​ మార్కెట్​ కేంద్రంగా..

సరూర్‌‌‌‌నగర్​లోని శారదనగర్‌‌‌‌కు చెందిన 50 ఏండ్ల ఓ పల్లీల వ్యాపారి ద్వారా తాజాగా ఐదుగురు గ్రేటర్​ హైదరాబాద్​ వాసులకు  కరోనా వైరస్‌‌ సోకినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఆ వ్యాపారికి మలక్​పేట్​ మార్కెట్​లో పల్లీల షాపు ఉంది. మలక్‌‌పేట్‌‌ మార్కెట్‌‌ కేంద్రంగా కరోనా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్‌‌ లింక్‌‌తో ఇప్పటివరకు 20 మందికి వైరస్ సోకింది.