ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలంటూ విమర్శలు

ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలంటూ విమర్శలు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర సర్కార్ తీరుతో వివిధ భవనాల నిర్మాణ ఖర్చు అంతకంతకు పెరిగిపోతున్నది. పనులు ఆలస్యం, డిజైన్లలో మార్పులతో ఎప్పటికప్పుడు నిర్మాణ ఖర్చులు పెంచుకుంటూ పోతున్నది. ఇట్ల సుమారు రూ.2 వేల కోట్ల దాకా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి తీసుకుచ్చింది. ఫలితంగా ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలవుతోందనే విమర్శలు వస్తున్నాయి. అమరవీరుల స్తూపం మొదలుకుని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియెట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు వరంగల్ తో పాటు హైదరాబాద్ శివార్లలో కొత్తగా నిర్మిస్తామన్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది.

సెక్రటేరియెట్.. కొత్త దవాఖాన్లకు కలిపి రూ.1370 కోట్లు పెరిగినయ్

వరంగల్, హైదరాబాద్​లో నిర్మించనున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు షురూ చేయకముందే అంచనా వ్యయం పెంచేసిన్రు. వరంగల్ హాస్పిటల్​ రూ.1100 కోట్లు అనుకుంటే అదీ కాస్త రూ.1250 కోట్లకు చేరింది. మరోవైపు రూ. 2,679 కోట్లతో ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్‌‌‌‌‌‌‌‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇది కాస్త రూ.3200 కోట్లు దాటుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే హాస్పిటల్స్ పనులు స్టార్టై నిర్మాణం పూర్తయ్యేసరికి ఖర్చు ఇంకెంత  పెంచుతారో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా దాదాపు రూ.670 కోట్లు పెరిగింది. ఇక కొత్త సెక్రటేరియేట్​ నిర్మాణం టెండర్లు 2020 అక్టోబర్​లో షాపూర్​జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యం కావడం, డిజైన్ల మార్పులతో రూ.400 కోట్ల ఖర్చుతో మొదలై ఇప్పుడు రూ.1100 కోట్లకు చేరుతున్నాయి.

కమాండ్ కంట్రోల్ సెంటర్​కు రూ.400 కోట్లు పెంచిన్రు

హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ లో ప్రభుత్వం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను నిర్మిస్తున్నది. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్న ఈ టవర్స్ నిర్మాణ ఖర్చు రెండింతలకు పైగా పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ముందు అనుకున్న దానికంటే రూ.400 కోట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్​ను సీఎం కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ భవనాన్ని దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో.. 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని అంచనా వేశారు. టెండర్లు దక్కించుకున్న షాపూర్​జీ పల్లోంజీ సంస్థ 2016 డిసెంబర్ లో నిర్మాణ పనులు ప్రారంభించింది. రెండున్నరేండ్లలో పూర్తి కావాల్సిన పనులు ఇప్పటికి చివరి దశకు చేరాయి. దీంతో అంచనాలు భారీగా పెరిగి రూ.700 కోట్లు ఖర్చు అయింది. 

అమరవీరుల స్తూపం ఖర్చు రూ.177 కోట్లు  

ఉద్యమంలో ప్రాణాలు వదిలి న అమరుల త్యాగాలకు చిహ్నంగా.. అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లుంబినీ పార్కు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో మూడున్నరేండ్ల కింద పనులు మొదలైయ్యాయి. ఇప్పుడు రూ.177 కోట్లకు చేరాయి. అంటే ముందు అనుకున్న దానికంటే రూ.97 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నది.  నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఖర్చు రూ.200 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రస్తుతం అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణ టెండర్లు ఏపీకి చెందిన కేపీసీ కన్ స్ట్రక్షన్స్​దక్కించుకుంది.

అంబేద్కర్ విగ్రహానికి రూ.60 కోట్లు పెంపు

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 125వ జయంతి పురస్కరించుకు ని 2016 ఏప్రిల్ 14న హుస్సేన్​ సాగర్ ఒడ్డున అంబేద్కర్​ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆరేండ్లు అయినా విగ్రహ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు. అంచనా ఖర్చులు రూ.104 కోట్లతో మొదలై ఇప్పుడు రూ.160 కోట్లకు చేరాయి. దాదాపు రూ.60 కోట్లు పెంచారు. విగ్రహ ఏర్పాటు పూర్తయ్యే సరికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలిన పీఠం, దానిపై 125 అడుగుల అంబేద్కర్​ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కమిటీని  ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైనాకు వెళ్లి విగ్రహానికి సంబంధించిన వివిధ అంశాలను స్టడీ చేసింది. అనేక మార్పులు చేస్తూ చివరకు విగ్రహానికి సంబంధించి విడి భాగాలను ఢిల్లీలో తయారు చేయిస్తున్నారు.