ఆదిత్య ఎల్1 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్..

ఆదిత్య ఎల్1 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్..

చంద్రయాన్ 3 ఇచ్చిన సక్సెస్ తో ఇస్రో శాస్త్రవేత్తలు మరో ప్రయోగం చేపట్టారు. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.

రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం (సెప్టెంబర్ 2న) ఉదయం 11 గంటల50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 1న) ఉదయం 11 గంటల50 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. సరిగ్గా 24 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పరిస్థితిని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సమీక్షిస్తున్నారు.

ALSO READ:నిర్మాతల కోసం వరుణ్ గ్రేట్ డెసిషన్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

సూర్యుడు- భూమి క‌క్ష్యలోని లగ‌రేంజ్ పాయింట్ (L1) వ‌ద్ద స్పేస్‌ క్రాఫ్ట్‌ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను నిల‌ప‌డం వ‌ల్ల.. సూర్యుడిని నిరంత‌రం చూసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇస్రో తెలిపింది.

గురువారం (ఆగస్టు 31న) షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధతపై సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.