దేశాన్ని నిరుద్యోగ భారత్​గా మార్చిన్రు : మంత్రి కేటీఆర్

దేశాన్ని నిరుద్యోగ భారత్​గా మార్చిన్రు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : దేశాన్ని నిరుద్యోగ భారత్​గా మార్చిందే బీజేపీ అని, ఆ పార్టీ నేతలకు నియామకాలపై మాట్లాడే హక్కు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ యువతను నమ్మించి మోసం చేశారని తెలిపారు. బీజేపీ పాలనలో దేశం మొత్తం బేరోజ్ గార్ మేళాగా మారిపోయిందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తిప్పికొట్టారు. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి పెరిగిపోయిందని విమర్శించా రు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన వాటికన్నా ఎక్కువ ఉద్యోగాలే భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకో 70 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. తాము పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రశ్న పత్రాల లీకేజీ అంటూ బీజేపీ కుట్రకు తెరలేపిందని విమర్శించారు. బండి సంజయ్ అనుచరుడే పేపర్ లీక్ చేసిన విషయం కిషన్ రెడ్డికి తెలీదా? అని ప్రశ్నించారు.

ఐటీఐఆర్​ను రద్దు చేసిందే బీజేపీ

తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీఐఆర్​ను రద్దు చేసిందే బీజేపీ ప్రభుత్వమని కేటీఆర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి ఉంటే స్థానికులకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఒక్కసారైనా ఎం దుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని వివరించారు. నోట్ల రద్దు, లాక్​డౌన్ లాంటి వాటి తో ఉపాధి దెబ్బతీసిందని విమర్శించారు.