30 వారాల ప్రెగ్నెన్సీ.. అబార్షన్​కు సుప్రీం ఓకే

30 వారాల ప్రెగ్నెన్సీ.. అబార్షన్​కు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: అత్యాచారంతో గర్భందాల్చిన 14 ఏండ్ల బాలికకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 30 వారాల ప్రెగ్నెన్సీని తొలగించేందుకు కోర్టు అనుమతించింది. మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత... అసాధారణ కేసుగా పరిగణించి ఈ తీర్పునిస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా బెంచ్ వెల్లడించింది. ప్రెగ్నెన్సీ మెడికల్ టెర్మినేషన్​కు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ముంబైలోని తిలక్ జనరల్ ఆస్పత్రి డీన్​ను బెంచ్ ఆదేశించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏండ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసేనాటికి ఆ అమ్మాయికి 28 వారాల ప్రెగ్నెంట్. దీంతో అబార్షన్​కు అనుమతివ్వాలంటూ బాధితురాలి తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

అందుకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఈ నెల 4న తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బాలిక తల్లి గతవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. బాలిక పరిస్థితిపై ముంబై ఆస్పత్రిని వివరణ కోరింది. కాన్పు తర్వాత ఏర్పడే ముప్పుతో పోలిస్తే అబార్షన్ చేయడంలో ఉండే ప్రమాదం తక్కువేనని డాక్టర్లు కోర్టుకు రిపోర్టు సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా అబార్షన్​కు అనుమతిస్తూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.