కోకిల గానం.. నెమలి నృత్యం!

కోకిల గానం.. నెమలి నృత్యం!

చవన అరణ్యంలో ఉండే కోకిల, నెమలి, పావురం, చిలుక మంచి స్నేహితులు. కోకిల ‘కుహూ కుహూ’మని పాడుతూ అరణ్యంలోని పక్షులు, జంతువులను ఉదయాన్నే నిద్రలేపేది. చిలుక అరణ్యంలోని పక్షుల యోగ క్షేమాలను తెలుసుకునేది. పావురం వార్తలు మోసుకొచ్చేది.
సాయంత్రాలు పక్షులన్నీ ఒక చోట చేరేవి. నెమలి అందంగా నాట్యం చేస్తుంటే ఆకాశంలోని ఇంద్రధనుస్సు నేలమీదికి వచ్చిందా అన్నట్లు ఉండేది. నెమలి నాట్యాన్ని చూసి పక్షులు ఆనందంతో తమ కష్టాన్ని మరిచిపోయేవి. వీటి సంతోషాన్ని చూసి ఓర్వలేక కాకి మామ కోకిల వద్దకు వెళ్లి ‘చూసావా మిత్రమా! నెమలి నృత్యం చేస్తుంటే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో! నీ పాటతో నిద్రలేచే ఈ పక్షులు మాత్రం నిన్నూ, నీ ప్రతిభను గుర్తించడం లేదు’ అని అన్నది.ఆ మాటలకు కోకిల ‘అవును! ప్రతిరోజు నా పాటతో నిద్రలేపుతున్నా. అయినా నన్నెవరూ పొగడటం లేదు’ అని మరుసటి రోజు నుండి కోకిల పాట పాడటం ఆపేసింది. నాట్యం నేర్చుకోవాలి అనుకుంది. ‘కానీ నాట్యం ఎలా నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు?’ అని ఆలోచనలో పడింది. స్నేహితుడైన పావురం వద్దకు వెళ్లి తన కోరిక చెప్పింది. ‘ఎన్నడూ లేనిది ఈ వింత కోరిక ఏమిటి?’ అని అడిగింది పావురం. కోకిల మౌనంగా ఉండిపోయింది.‘సరే నాకు కొంత సమయం ఇవ్వు. ఆరాతీసి సమాచారం చెప్తా’ అన్నది పావురం.
కాకి మామ నెమలి వద్దకు వెళ్లి ‘మిత్రమా కోకిల చాలా బాగా పాడుతుందని అడవిలోని పక్షులన్నీ మాట్లాడుకుంటుండగా విన్నా.నీకేం తక్కువ నీ నృత్యంతో అందరూ సంతోష పడుతున్నారు కదా’ అన్నది. ఆ రోజు నుండి నెమలి ఆలోచనలో పడింది. 
‘మిత్రమా నేను పాటలు పాడడం నేర్చుకోవాలి అనుకుంటున్నా. స్వరం కూడా మృదువుగా మారాలి. అరణ్యంలో మంచి గాయకులు ఎవరైనా ఉంటే చెప్పు’ అని చిలుకను అడిగింది నెమలి. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన చిలుక ‘సరే మిత్రమా! నాకు రెండు రోజులు సమయం ఇవ్వు చెప్తా’ అన్నది.
చిలుక, పావురం కలుసుకొని కోకిల, నెమలిల వింత కోరికల గురించి చర్చించుకున్నాయి ఎలాగైనా వాటి ఆలోచనలో మార్పు తీసుకొచ్చి మునుపటిలా కలిసి మెలిసి ఆనందంగా ఉండేలా చేయాలి అనుకున్నాయి’ అవి. అనుకున్నదే తడవుగా అడవికి పెద్దదైన ఎలుగుబంటి దగ్గరికి వెళ్లాయి. వాటి మిత్రుల వింత కోరికలను చెప్పాయి. ‘మీరే వాటిని సరైన మార్గంలో పెట్టాల’ని ఎలుగుబంటిని వేడుకున్నాయి. 
‘సరే మీ మిత్రులను రేపు తీసుకురండి’ అని చెప్పింది ఎలుగుబంటి. కోకిలను, నెమలిని వెంటబెట్టుకుని ఎలుగుబంటి ఆశ్రమానికి వెళ్లాయి చిలుక, పావురం. తన వద్ద ఉన్న నెమలితో కోకిలకు నృత్యం నేర్పించసాగింది. తన వద్దే ఆశ్రయం పొందుతున్న కోకిలతో నెమలికి గానం ఎలా చేయాలో నేర్పించసాగింది. కొన్ని రోజుల తర్వాత ఎలుగుబంటి వచ్చి కోకిలను, నెమలిని ‘మీ సాధన ఎలా సాగుతోంది? ఏమైనా నేర్చుకున్నారా?’ అని అడిగింది ఎలుగుబంటి. కోకిల, నెమలి తెల్ల ముఖం వేశాయి.
‘మిత్రులారా! మీ ప్రతిభ చూసి ఓర్వలేక కాకి మామ ఇలా చేసిందని తెలుసుకున్నా. మీరు ఇతరుల మాటల్ని నమ్మి మీకు ఉన్న సహజ సామర్ధ్యాలను వదిలేసారు. పుట్టుకతో కొన్ని జీవులకు కొన్ని సహజ లక్షణాలు అలవడతాయి. కోకిలకు మధురమైన కంఠం. నీకు అందమైన ఆకారంతో, అంతకంటే అందంగా నృత్యం చేసే గొప్పతనం ఉన్నది. మీరు ఇప్పుడు చేసే పని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది. మీకున్న సామర్థ్యాల్లో మరింతగా సాధన చేయండి. అద్భుత విజయాలు సాధిస్తారు’ అని చెప్పింది ఎలుగుబంటి. 
తమ తప్పును గ్రహించిన కోకిల మరుసటి రోజు నుండి తన గానంతో చవన అరణ్యాన్ని నిద్ర లేపడం మొదలుపెట్టింది. సాయంత్రం కాగానే నెమలి నృత్యం చేసి అలరించింది. మిత్రుల్లో వచ్చిన మార్పుకు పావురం, చిలుక సంతోషించాయి.
- ముక్కామల జానకీరామ్