దళితబంధు పథకం కింద కంపెనీలు పెడతామని మోసం

దళితబంధు పథకం కింద కంపెనీలు పెడతామని మోసం

కరీంనగర్, వెలుగు : దళితబంధు పథకం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పంట పండిస్తోంది. నిజమైన దళితుల సంగతి దేవుడెరుగు..అనర్హులు, పైరవీలు చేసుకునేవాళ్లు, లీడర్లు, వారి దగ్గరోళ్లకే సొంతమవుతోంది. సరిగ్గా ఇలాగే కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోనూ జరిగింది. కాకపోతే పక్కా ప్లాన్​ ప్రకారం...ఇక్కడి జడ్పీ చైర్​పర్సన్​ కనుమల్ల విజయ భర్త, బిడ్డ, కుటుంబసభ్యులు కలిసి దళితబంధు పథకం కింద కంపెనీలు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని విలువైన భూమిని లీజు పేరిట కొట్టేశారు. సుమారు రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసే ఈ స్కీం కింద రూ.కోట్ల భూమిని సొంతం చేసుకున్నారు. చుట్టాలు, పక్కాలు కలుపుకుని మొత్తం 23 మంది పేర్లను రెండు లిస్టుల్లో చేర్చి జమ్మికుంట పట్టణానికి సమీపంలో ఎకరం భూమిని సొంతం చేసుకున్నారు. ఆటోనగర్ ఏరియాలో కేటాయించిన ఈ భూమిలో మంగళవారం పనులు మొదలుపెట్టగా, అక్కడికి వెళ్లిన జడ్పీ చైర్​పర్సన్​భర్త గణపతిని స్థానికులు అడ్డుకున్నారు. 

బస్ డిపోకు ఇచ్చిన జాగాపై కన్ను

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట నుంచి కోరపల్లి రోడ్డులో ఆటో నగర్ ఏరియా ఉంది. ఇక్కడ ప్రభుత్వ సీలింగ్ సర్ ప్లస్ జాగాలు ఉండగా, నాలుగెకరాల్లో గతంలో మినీ బస్​డిపో కట్టాలని ప్రతిపాదించారు. హుజూరాబాద్ డిపో నుంచి వెళ్లే బస్సుల్లో 60 శాతానికి పైగా బస్సులు ఇదే రూట్ నుంచి వెళ్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏరియాలో మినీ డిపో  నిర్మిస్తే అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని ఆలోచించారు. స్థానిక ఎమ్మెల్యే ఈటల‍ రాజేందర్​ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కేటాయింపులు చేశారు. పూర్తి స్థాయిలో సర్వే కూడా చేశారు. ఆర్టీసీలో ఉన్న డిపోలనే ఎత్తివేసే పరిస్థితులు రావడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ జాగా అలాగే ఉండిపోయింది. దళితబంధు పథకం రావడంతో కోట్ల రూపాయల విలువ చేసే ఈ జాగాపై జడ్పీ చైర్​పర్సన్​ కుటుంబం కన్ను పడింది. 

భర్త...బిడ్డ...పాలోళ్లు..దగ్గరోళ్లు కలిసి...

అనుకున్నదే తడవుగా జడ్పీ చైర్​పర్సన్​ విజయ పరపతితో ఆమె భర్త గణపతి, కూతురు దివ్య, తోటి కోడలు కనుమల్ల లక్ష్మీకాంత, ఇతర బంధువులు కనుమల్ల శారద, కనుమల్ల శంకరయ్య, పాలోళ్లు..దగ్గరగా ఉన్న లీడర్లు, కాంట్రాక్టర్లు, అంగన్ వాడీ కార్యకర్త.. ఇలా తాము చెబితే వినే అనుచర గణాన్ని చేర్చుకున్నారు. రెండు ఫర్మ్ లను ఏర్పాటు చేశారు. రేకుల బెండింగ్ ఇండ్రస్టీలో జడ్పీ చైర్​పర్సన్ ​భర్త గణపతి ఆధ్వర్యంలో 19 మందిని చేర్చుకోగా.. గోలీ సోడా కంపెనీలో ఆమె బిడ్డ దివ్యతో పాటు మరో ముగ్గురిని కలిపారు. ఇలా మొత్తం 23 మంది జత కలిశారు. వీరంతా కలిసి దళితబంధు పథకం కింద రూ.2.27 కోట్లు తీసుకున్నారు. ఇందులో ఇద్దరు పథకం డబ్బులు తీసుకున్న తర్వాత చనిపోయారు.  

నెల రోజుల్లోనే పనులన్నీ చకచక.. 

ఆటో నగర్ ఏరియాలో కొంతకాలం కింద చాలా మంది పేదలకు ఇండ్ల స్థలాలిచ్చారు. ఈ ఏరియాలోనే జడ్పీ చైర్​పర్సన్​ కుటుంబసభ్యులకు స్థలం ఉన్నట్టు సమాచారం. దీంతో పక్కనే ఉన్న 275,  278 సర్వే నంబర్లలో సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ ఉంది. దీంతో ఇందులోని ఎకరం భూమిపై వీరి కన్ను పడింది. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ప్లాన్​వేసి దళితబంధు స్కీమ్ ను అడ్డుపెట్టుకున్నారు. స్థలంలో ఇండస్ట్రీ నిర్మిస్తామని, అందరికీ ఉపాధి కల్పిస్తామని కలెక్టర్ ను కలిశారు. రెండు ఫర్మ్​లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతిపాదనలు తయారు చేసి జూన్ నెల రెండో తేదీన కలెక్టర్​ను జాగా అడిగారు. వీరు అడగ్గానే కలెక్టర్ ఆర్వీ కర్ణన్ 8న జమ్మికుంట తహసీల్దార్​కు ఆదేశాలు జారీ చేశారు. తెల్లవారే తహసీల్దార్​ఫీల్డ్ లెవెల్​కు వెళ్లి వెరిఫై చేయడం, ఎకరం ల్యాండ్ ఉందంటూ టీఐసీసీ జోనల్ మేనేజర్ కు లెటర్ రాయడం చకచకా జరిగిపోయాయి. నెల తరవాత కలెక్టర్ సైతం టీఐసీసీ వైస్ చైర్మన్​కు భూమి కేటాయించాలని లెటర్​రాశారు. వీటన్నింటిని పరిశీలించి ఈ నెల 19న సదరు ఫర్మ్​లకు ఎకరం భూమిని లీజు కింద కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు.  

పేరుకే లీజు.. 

ఎకరం స్థలంలో రేకుల ఇండ్రస్ట్రీకి  2525 చదరపు మీటర్లు కేటాయించారు. ఇందులో చదరపు మీటర్ కు రూ. 421 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గోలీ సోడా ఇండస్ట్రీ కోసం 1515 చదరపు మీటర్లు కేటాయించగా,  చదరపు మీటర్​కు రూ. 371 చెల్లించాలన్నది నిబంధన. ఈ రెండు స్థలాల విలువను సర్కారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే రూ. 16 లక్షలు అవుతుంది. వీరికి 33 శాతం రిబేట్ అవకాశం ఉండడంతో కేవలం రూ.11లక్షలకే భూమి మొత్తం సొంతమవుతున్నది. కానీ స్థలం వాస్తవ విలువ సుమారు రూ. 2 కోట్ల వరకూ ఉంది. ఈ ల్యాండ్ 10 ఏండ్ల వరకు లీజ్ అని చెబుతున్నా..మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత పూర్తిగా వీరి హస్తగతమే అవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నామమాత్రంగా కంపెనీల పేర్లు చెప్పి భూములు కాజేసి.. కొద్ది రోజుల తరవాత సొంతం చేసుకోవాలనే ఆలోచనతోనే ఇలా చేశారంటున్నారు.  

అడ్డుకున్న స్థానికులు

ఆటోనగర్ ఏరియాలోని ఎకరం భూమి చదును చేయించడానికి చైర్మన్ భర్త గణపతి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక కౌన్సిలర్ కలిసి మంగళవారం జేసీబీ తో సహా చేరుకున్నారు. పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న టైమ్ లోనే అక్కడే ఉన్న క్వారీ దగ్గర కొన్నేండ్ల నుంచి రాళ్లు కొట్టే  పని చేసుకునే వారు అడ్డుకున్నారు. తాము ఏమి లేని పేదలమని.. ఈ స్థలం తమకే కేటాయించాలని డిమాండ్​చేశారు. జేసీబీని తీసుకువెళ్లని పక్షంలో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.  ప్రభుత్వమే  తమకు ఇచ్చిందని ప్రోసిడింగ్ కాపీలను అందించిందని చైర్​పర్సన్​భర్త గణపతి చూపించినా వారు వినలేదు. దీంతో చేసేది లేక జేసీబీని అక్కడే వదిలి వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు.