శ్రీశైలం పవర్ ప్లాంట్ నష్టం ఇప్పట్లో తేలదు

శ్రీశైలం పవర్ ప్లాంట్ నష్టం ఇప్పట్లో తేలదు

అమ్రాబాద్/నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్లాంట్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. సర్వీస్ బే, ఒకటి రెండు ఫ్లోర్లను శుభ్రం చేసేందుకు బయటి నుంచి వంద మంది కూలీలను రప్పించారు. జెన్ కో ఉద్యోగులు, కార్మి కులు 20 మంది వరకు రెం డు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. టర్బైన్ ఫ్లోర్ లో ఆయిల్ ఉండటంతో నడవడానికి ఇబ్బందిగా మారింది.పై రెండు ఫ్లోర్లలో కాలిపోయిన వస్తువులను తొలగించారు.

ఆస్తి నష్టం ఎంతో?

ప్లాంట్ ప్రమాదం వల్ల ఆస్తి నష్టం ఎంత అనేది ఇప్పుడు చెప్పడం కష్టమని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ‘‘నిన్నటి వరకు ఫస్ట్ ఫ్లోర్ లోకి కాలు పెట్టే పరిస్థితి లేదు. ఫ్లోర్ల వారిగా ఒక్కో డిపార్ట్ మెంట్ ను పరిశీలించాలి. ఎంత డ్యా మేజ్ అయ్యిందో చూసి అవి పనికివస్తాయో రావో తేల్చాలి. అప్పుడే నష్టం ఎంత అనేది తెలుస్తుంది” అని ఆయన అన్నారు.

6 యూనిట్ పరిస్థితి ఏంటి?

4వ యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా 6వ యూనిట్ పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2,400 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని సమాచారం. 1,2,3,5 యూనిట్లు బాగానే ఉంటాయన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు. పవర్ సప్లై జరిగి తేనే ఎంత ఆస్తినష్టం జరిగిందనే దానిపై ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. గురువారం మధ్యాహ్నం పవర్ ప్లాంట్లోకి వెళ్లిన సీఐడీ టీం ..అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్ తో మాట్లాడి స్టేట్ మెంట్లు రికార్డు చేసుకుంది.

సీఎండీ వార్నింగ్. . అంతా సైలెంట్

ఇంటిగుట్టు బయటపెడుతూ సంస్థ పరువు తీస్తున్నారని, ఫొటోలు, వీడియోలతోపాటు అక్కడి విషయాలు బయటకుపోతున్నాయని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తప్పుపట్టడంతో ఉద్యోగులు మరింత అభద్రతా భావానికి గురవుతున్నారు. బుధవారం ప్లాంట్ వద్దకు వచ్చిన సీఎండీ ‘‘నేను ఇంజనీర్ ను . మీరు ఇంజనీర్లు. ఏమైనా ఉంటే మనం మనం మాట్లాడుకోవాలి. బయటకు లీకులిస్తే నేను సీఎంకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. నన్ను వద్దనుకుంటే ఐఏఎస్ వస్తాడు అంతే’’ అని హెచ్చరించినట్లుగా మాట్లాడారని ఓ ఉద్యోగి వాపోయాడు. ప్రమదం రోజు తోటి వారు పడిన బాధ గురించి ఉద్యోగులు మాట్లాడితే సీఎండీ తప్పుపట్టడం ఏమిటని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. గురువారం పక్కవారి తో కూడా ఉద్యోగులు మాట్లాడటానికి జంకే పరిస్థితి కనిపించింది.