800 మంది కార్మికులు.. 60 గంటలు పని రికార్డ్‌‌‌‌ టైంలో ఇంటికన్నె వద్ద ట్రాక్‌‌‌‌ పునరుద్ధరణ

800 మంది కార్మికులు..  60 గంటలు పని రికార్డ్‌‌‌‌ టైంలో ఇంటికన్నె వద్ద  ట్రాక్‌‌‌‌ పునరుద్ధరణ
  • భారీ వర్షాలకు మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో కొట్టుకుపోయిన ట్రాక్‌‌‌‌
  • రాత్రింబవళ్లు శ్రమించిన ఇంజినీర్లు వందలాది మంది కార్మికులు
  • బుధవారం ఉదయం ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌
  • రైళ్లను పునరుద్ధరించిన ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు : భారీ వర్షాల వల్ల మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌‌‌‌ను రికార్డ్‌‌‌‌ టైంలో పునరుద్ధరించారు. ఆదివారం డ్యామేజీ అయిన ట్రాక్‌‌‌‌ను బుధవారం ఉదయం వరకు సరి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైల్వే ఇంజినీర్లతో పాటు సుమారు 500 మంది రైల్వే కార్మికులు, 300 మంది ప్రైవేట్‌‌‌‌ కార్మికులు, 20 జేజీబీలు, 25 టిప్పర్లతో షిఫ్ట్‌‌‌‌ల వారీగా నిరంతరాయంగా పనులు చేసి 60 గంటల్లో రిపేర్లు పూర్తి చేశారు.

300 మీటర్లు దెబ్బతిన్న ట్రాక్‌‌‌‌

శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి, ఇంటికన్నె వద్ద ట్రాక్‌‌‌‌ పూర్తిగా, మరో 12 చోట్ల పాక్షికంగా దెబ్బతింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇంటికన్నె వద్ద ట్రాక్‌‌‌‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో తేలియాడాయి. సుమారు 300 మీటర్ల మేరక ట్రాక్‌‌‌‌ దెబ్బతింది. సీనియర్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ రాజమౌళి ఆధ్వర్యంలో రైల్వే గ్యాంగ్‌‌‌‌మెన్లు, బ్రిడ్జి వాచ్‌‌‌‌మెన్‌‌‌‌ రాజు, గుగులోతు మోహన్‌‌‌‌ ప్రమాదాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో మహబూబాబాద్, కేసముద్రం రూట్‌‌‌‌లో పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌‌‌‌ పూర్తిగా దెబ్బ తినడంతో సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వేకు సుమారు రూ.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

ప్రతికూల వాతావరణంలోనూ పునరుద్ధరణ పనులు

రైల్వే ట్రాక్‌‌‌‌ పునరుద్ధరణ టైంలో వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ పనులను కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో ముసురువాన పడుతున్నప్పటికీ పనులను ఆపలేదు. వందలాది మంది కార్మికులు ఘటనాస్థలంలోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడే వంటలు చేసుకుంటూ, నిద్రపోతూ పనులు పూర్తి చేశారు. మూడో ట్రాక్‌‌‌‌ పనులు జరుగుతున్న ప్రాంతం నుంచే కాకుండా విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి గూడ్స్‌‌‌‌లో మట్టి, కంకర తీసుకొచ్చారు. 

ఇంజినీర్ల పర్యవేక్షణలో రైల్వే కార్మికులు పట్టాల మధ్య కంకర పోసి గ్యాప్‌‌‌‌ లేకుండా సరిచేశారు. ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలంలోనే ఉండి కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. కార్మికులు ఎప్పటికప్పుడు ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించారు. 

ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

రైల్వే ట్రాక్‌‌‌‌ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో బుధవారం ఉదయం 8 గంటలకు ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ నిర్వహించారు. ఇది సక్సెస్‌‌‌‌ కావడంతో రైల్వే ఆఫీసర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఘటనాస్థలాన్ని రైల్వే సీసీఈ బ్రహ్మానందయ్య, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌ జైన్‌‌‌‌, గతి శక్తి చీఫ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ సుబ్రహ్మణ్యం, ఏడీఆర్‌‌‌‌ఎం గోపాల్‌‌‌‌నాయక్‌‌‌‌, డీఆర్ఎం భారతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ సందర్శించారు.

లో లేవల్‌‌‌‌ కాజేవేలపై నిరంతరం నిఘా

రైలు పట్టాల వెంట లోలెవల్‌‌‌‌ కాజ్‌‌‌‌వేలపై నిరంతరం నిఘా ఉంచాలని సీనియర్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. గ్యాంగ్‌‌‌‌మెన్లు, వాచ్‌‌‌‌మెన్లు వర్షాకాలంలో వాటర్‌‌‌‌ లెవల్స్‌‌‌‌ను పరిశీలిస్తూ ఉండాలని, రైలు పట్టాలకు దగ్గరి వరగు నీరు చేరితే వెంటనే ఉన్నతాధికారులకు అందించడంతో పాటు, ఆ రూట్‌‌‌‌లో వెళ్లే రైళ్లను అలర్ట్‌‌‌‌ చేయాలని సూచించారు.