క్రెడిట్ కార్డ్స్ వాడకం ఒక సౌకర్యంగా మారినప్పటికీ.. బిల్లుల చెల్లింపులో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు, వాటి చెల్లింపు గడువు, బకాయిలు చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి రిజర్వు బ్యాంక్ ఏం చెబుతోంది.. పూర్తి బిల్ అమౌంట్ కట్టకపోతే ఏం జరుగుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మినిమం డ్యూ అంటే ఏమిటి?
చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు బిల్లు రాగానే కేవలం మినిమం అమౌంట్ డ్యూ మెుత్తాన్ని చెల్లించి సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ డిఫాల్ట్ గా భావించరు కానీ.. మిగిలిన బకాయిపై కాంపౌండ్ ఇంట్రస్ట్ పడుతూనే ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులపై ఏడాదికి 30% నుండి 45% వరకు భారీ వడ్డీ వసూలు చేస్తాయి కంపెనీలు. గడువులోగా పూర్తి బిల్లు చెల్లించకపోతే.. 'వడ్డీ లేని క్రెడిట్ కాలం' సౌకర్యాన్ని మీరు కోల్పోతారని తెలుసుకోండి.
RBI మార్గదర్శకాల ప్రకారం.. కార్డ్ యూజర్లు పాక్షికంగా బిల్లు చెల్లిస్తే, మిగిలిన బకాయిపై మాత్రమే వడ్డీ, లేట్ ఫీజు విధించాలి. మొత్తం బిల్లుపై కాకుండా.. చెల్లింపులు/రిఫండ్‌లు సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన నెట్ బకాయిపైనే ఈ చార్జీలు వర్తిస్తాయి. అయితే ఒకసారి గడువు తప్పితే.. మీరు కొత్తగా చేసే ప్రతి లావాదేవీపై కూడా ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుండే వడ్డీ లెక్కించబడుతుందని గుర్తుంచుకోండి. ఈ విషయం చాలా మందికి తెలియక కార్డు వాడేస్తుంటారు పాత బ్యాలెన్స్ క్లియర్ చేయకుండానే.
డిఫాల్టర్‌గా ఎప్పుడు ప్రకటిస్తారు?
క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు వరుసగా 6 నెలల పాటు కనీస బకాయిని కూడా చెల్లించకపోతే సదరు వ్యక్తిని డిఫాల్టర్ కింద పరిగణిస్తాయి. దీనివల్ల CIBIL స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీని కారణంగా భవిష్యత్తులో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటివి పొందడం దాదాపు అసాధ్యం అవుతుంది.
ఒక వ్యక్తిని డిఫాల్టర్‌గా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించే ముందు.. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు ఖచ్చితంగా నోటీసు ఇవ్వాలి. వివాదంలో ఉన్న లావాదేవీల విషయంలో బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు డిఫాల్ట్ సమాచారాన్ని వెల్లడించకూడదని RBI స్పష్టం చేసింది.
క్రెడిట్ కార్డ్ యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* వీలైనంత వరకు పూర్తి బిల్లును గడువులోగా చెల్లించడానికి ప్రయత్నించండి.
* కేవలం కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ పోవడం వల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
* ఆర్థిక ఇబ్బందుల వల్ల బిల్లు కట్టలేని స్థితిలో ఉంటే.. వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి పరిష్కారం లేదా EMI సౌకర్యం కోసం అడగండి. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

