
అబిడ్స్ పీఎస్ పరిధిలో ఘటన
అబిడ్స్, వెలుగు: తమ పిల్లలకు సరదాగా ‘ది లయన్కింగ్’ సినిమా చూపిద్దామని థియేటర్ కి తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. వారి మూడేళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు థియేటర్ పై నుంచి పడి..హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అబిడ్స్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్సై సైదులు చెప్పారు. నాంపల్లిలోని రెడ్ హిల్స్ లో ఉంటున్న పవన్ కుమార్, శిరీష దంపతులు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సాయంత్రం ‘ది లయన్ కింగ్’ మూవీ చూసేందుకు అబిడ్స్ లోని సంతోష్ థియేటర్ కి వెళ్లారు.
రాత్రి 7.30గంటలకు ఇంటర్వెల్ సమయంలో తల్లి శిరీష ,సోదరితో కలిసి బాల్కనీలోకి వచ్చిన పృథ్వీ(3) ప్రమాదవశాత్తు మొదటి అంతస్థు నుంచి కిందకి జారిపడ్డాడు. పవన్ కుమార్, శిరీష తమ చిన్నారి పృథ్వీని వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ పృథ్వీ ఆదివారం అర్ధరాత్రి చనిపోయాడు. సినిమా థియేటర్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తమ పిల్లాడు చనిపోయాడని పవన్ కుమార్ ఆరోపించారు. బాలుడి తండ్రి కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సైదులు తెలిపారు.