
హైదరాబాద్, వెలుగు: గణనాథుల నిమజ్జనం ఆలస్యం బుధవారం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రి వరకు నిమజ్జనాలు కొనసాగడంతో లక్డీకాపూల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్అయ్యింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుల భారీ వెహికల్స్క్యూ కట్టడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పాతబస్తీ సహా నగరవ్యాప్తంగా చాలా విగ్రహాలు ఆలస్యంగా నిమజ్జనానికి బయలుదేరాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కూడా చార్మినార్ వరకు క్యూ కనిపించింది. దాదాపు 30 వేలకు పైగా విగ్రహాలు ఒకేసారి నిమజ్జనానికి తరలివచ్చాయి.
ఆ ఎఫెక్ట్ సిటీ అంతా..
నిమజ్జనానికి క్యూ కట్టిన భారీ ట్రక్కులు, మరో వైపు నిమజ్జనం పూర్తిచేసుకుని వెళ్తున్న లారీలతో హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. బుధవారం వర్కింగ్‌డే కావడంతో ఉదయం 7గంటల నుంచే ఉద్యోగులు, స్టూడెంట్స్రోడ్లపైకి వచ్చారు. రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానంగా 9 గంటల నుంచి 10.30గంటల వరకు లక్డీకాపూల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లిబర్టీ, రాణిగంజ్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం రోడ్లపై వాహనాల క్యూ కనిపించింది.
రోడ్లపై దారి మళ్లింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను ట్రాఫిక్ కారణంగా తీయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రూట్లను కలిపే ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, లిబర్టీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచింది. పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్, మాసబ్ ట్యాంక్ ఏరియాలపై ఆ ప్రభావం పడింది. సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ సహా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.