పత్తి పంటపై డాక్యుమెంటరీలు

పత్తి పంటపై డాక్యుమెంటరీలు

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయ శాఖ కూడా డిజిటల్ ట్రెండ్ ఫాలో అవడానికి డిసైడ్ అయింది. రైతులకు మరింత దగ్గర కావడానికి యూట్యూబ్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అగ్రికల్చర్‌‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించి రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ సిద్దపడుతోంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలో.. ఏ క్లస్టర్​లో.. ఏ పంట వేయాలో రైతులకు డాక్యుమెంటరీ ఫిల్మ్ ద్వారా వివరించనున్నారు. ఈ ఫిల్మ్ ను రూపొందించే బాధ్యతను జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫిల్మ్ డివిజన్ కు అప్పగించారు. యూట్యూబ్​లో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయించనున్నారు.

సోషల్‌‌ మీడియా ద్వారా ప్రచారం

అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్ రూపొందించే ఈ డాక్యుమెంటరీ రైతులకు త్వరగా చేరేందుకు సోషల్‌‌ మీడియాను వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అనుకుంటోంది. ఫేస్ బుక్ ప్రచారంతో పాటు వాట్సాప్‌‌ ద్వారా రైతుల మొబైల్‌‌ నంబర్లకు వీడియోలు పంపించనున్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేయనుంది. దీంతో పాటు రైతులకు కావల్సిన సమాచారాన్ని పాంప్లెట్లపై ప్రింట్ చేసి క్షేత్ర స్థాయిలో సిబ్బంది ద్వారా అందించనున్నారు. వానాకాలం సీజన్‌‌కు ముందే డాక్యుమెంటరీ ఫిల్మ్‌‌లు తీసి, బ్రోచర్లు ముద్రించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. 

శాస్త్రీయ పద్దతిలో పంటల సాగు...

ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌ నుంచి వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులు, ఎక్కడ ఏ పంటలు ఎక్కువ పండుతాయో ఇప్పటికే వ్యవసాయశాఖ గుర్తించింది. రాష్ట్రంలో సాగైయ్యే అన్ని ప్రధాన పంటలను 2,615 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 , కందులకు 71, సోయాబీన్‌‌కు 21, మొక్కజొన్నకు 9 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయా బీన్‌‌తో పాటు పలు పంటలను ఏ జిల్లాలో ఎంత వేయాలనే ప్రణాళికల ప్రకారం డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నారు. 

పత్తి పంటపై ఫోకస్ చేసిన వ్యవసాయ శాఖ.. దాదాపు 80 లక్షల ఎకరాల్లో ఈ పంట వేయాలని రైతులకు సూచిస్తోంది. రైతులకు కాటన్ పంట వల్ల కలిగే లాభం, మార్కెట్ వసతిపై జిల్లాల వారిగా డాక్యుమెంటరీలు నిర్మించి యూట్యూబ్ ద్వారా ప్రచారం చేయనున్నారు.