దేవాదుల స్కీమ్​ అంచనా వ్యయం పెంపుకు రెడీ!

దేవాదుల స్కీమ్​ అంచనా వ్యయం పెంపుకు రెడీ!
  •     అంచనా వ్యయం పెంచేందుకు ప్రపోజల్స్ రెడీ
  •     ఇప్పటికే రూ.6 వేల కోట్ల నుంచి  రూ.13 వేల కోట్లకు పెంపు
  •     టార్గెట్ 6 లక్షల ఎకరాలు ..నీళ్లిస్తున్నవి లక్ష ఎకరాలకే..  
  •      60 టీఎంసీలకు ఎత్తిపోస్తున్నది  8 టీఎంసీలే
  •      కావాల్సిన ఫండ్స్​ కేటాయించని రాష్ట్ర సర్కారు  

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : దేవాదుల ఎత్తిపోతల స్కీం బడ్జెట్​మరో రూ.2 వేల కోట్లు పెరగనుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పనులు పూర్తి చేయడం కోసం నీటిపారుదల శాఖ ఆఫీసర్లు మరోసారి బడ్జెట్ ‌లెక్కించడానికి ఫైల్‌‌ రెడీ చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్‌ ‌అంచనా వ్యయం పెరగనుంది.18 ఏండ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయగా, ప్రతి ఏడాది కేవలం 8 నుంచి10 టీఎంసీలను మాత్రమే ఎత్తిపోస్తున్నారు. దీంతో ఏటా కేవలం లక్ష ఎకరాలకే సాగునీరందుతోంది. రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో 2004లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌‌ ఇప్పటికీ పూర్తి కాలేదు. 2016లో బడ్జెట్‌‌ను13,445 కోట్లకు పెంచగా, మరోసారి రూ.2 వేల కోట్ల అంచనా వ్యయం పెరగబోతోంది. ఈ ప్రాజెక్ట్‌‌ పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల్లో  25 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కేంద్రం నుంచి రూపాయి కూడా రాని కాళేశ్వరం ప్రాజెక్ట్​పై లక్ష కోట్ల దాకా ఖర్చు చేయగా, చివరి దశలో ఉన్న దేవాదుల కోసం 5 వేల కోట్లు ఒకేసారి ఖర్చు చేయలేక పనులు పెండింగ్‌‌లో పెడుతోంది. దీంతో ఈ స్కీమ్​ ముక్కుతూ ములుగుతూ సాగుతోంది. 

రెండింతలు పెరిగిన అంచనా వ్యయం

ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారు. 2004లో రూ.6016 కోట్ల అంచనా వ్యయంతో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి..38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్‌ చేయడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏఐబీపీ పథకం కింద ఇంజినీరింగ్‌ ‌పనుల కోసం సాయం చేస్తోంది. ప్రతి యేటా ఖర్చు చేసిన మొత్తంలో 25 శాతం నిధులను సమకూరుస్తోంది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోవడంతో 2010 నాటికి బడ్జెట్​ రూ.9427.73 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సర్కారు 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచగా.. అంచనా వ్యయం కూడా భారీగా పెరిగి 2016 నాటికే రూ.13,445 కోట్లకు చేరింది. ఇప్పటికీ ప్రాజెక్ట్‌‌ పూర్తి కాకపోవడంతో అదనంగా రూ.2 వేల కోట్లు పెంచుతూ నీటి పారుదల శాఖ ఆఫీసర్లు ఫైల్‌ ‌రెడీ చేశారు. మొదటి దశ పనులు 2005లోనే పూర్తికావాల్సి ఉండగా, 17 ఏండ్లవుతున్నా ప్యాకేజీ 45, ప్యాకేజీ 46 పనులు కంప్లీట్​ కాలేదు. రెండో దశ పనులు కూడా 2007 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా, ఆశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీ పనులు 60 శాతం కూడా కంప్లీట్ చేయలేదు. మూడో దశలో 8 ప్యాకేజీల కింద జరుగుతున్న పనులన్నీ పెండింగ్​లోనే ఉన్నాయి. అధికారులు గడువు పెంచుకుంటూనే పోతున్నారు. 

రీ డిజైన్‌‌ కే పరిమితం

ఏడాదికి 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడం దేవాదుల ప్రాజెక్ట్​ ప్రస్తుత లక్ష్యం కాగా, ఉమ్మడి వరంగల్‌‌, కరీంనగర్‌‌, నల్గొండ జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని టార్గెట్​పెట్టుకున్నారు. వీటిలో 5.57 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, 64 వేల ఎకరాలకు చెరువుల కింద సాగునీరందించాలి. ఇప్పటివరకు కేవలం 1.56 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే స్థిరీకరించారు. 2018‒19లో 2,90,643 ఎకరాలు, 2019‒20లో 1,10,288 కొత్త ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. నిధుల కేటాయింపు లేకపోవడంతో 3 వేల ఎకరాలకు పైగా భూసేకరణ పెండింగ్‌‌లో ఉంది. ఈ భూముల కోసమే రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన పనుల వల్ల సాగవుతున్న భూములు మినహా ఐదేండ్లలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరందించలేకపోయారు. దేవాదులను కూడా రీ డిజైన్‌ ‌చేసి రామప్ప నుంచి లక్నవరానికి నీళ్లను పంపింగ్‌‌ చేయడం తప్ప పెండింగ్‌‌ పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. 

కాలువల నిర్మాణం పూర్తి కాలే

దేవాదుల స్కీమ్​లో మొదటి, రెండో, మూడో దశల్లో కలిపి 17 రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. ధర్మసాగర్‌‌, నర్సింగాపూర్‌‌, ఆర్‌‌ఎస్‌ ‌ఘన్‌‌పూర్‌‌, ఆశ్వరావుపల్లి, చీటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌‌పల్లి, నష్కల్‌‌, పాలకుర్తి, చెన్నూర్‌‌, నవాబ్‌‌పేట, లద్నూర్‌‌, కన్నెబోయినగూడెం, మాసిరెడ్డి చెరువు, ఐనాపూర్‌‌లను రిజర్వాయర్లుగా మార్చి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలి. ఇప్పటికీ 4.7 లక్షల ఎకరాలకు నీరందించడానికి కాలువల నిర్మాణమే పూర్తి కాలేదు.  రిజర్వాయర్ల పనులూ పెండింగ్‌‌లోనే ఉన్నాయి. 

8.33 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్‌‌

మొదటి, రెండోదశ పైప్‌‌లైన్‌‌ నిర్మాణ పనులు గత కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. 2014కు పూర్వం నుంచే నీటి పంపింగ్‌‌ స్టార్టయ్యింది. ఈ ఏడాది కూడా ఈ రెండు పైప్‌‌లైన్లతో పాటు మూడో దశ పైప్‌‌లైన్‌‌ ద్వారా 8.33 టీఎంసీల నీళ్లను మాత్రమే లిఫ్ట్‌‌ చేశారు. ధర్మసాగర్‌‌, ఆర్‌‌ఎస్‌‌ ఘన్‌‌పూర్‌‌ తదితర రిజర్వాయర్ల కింద లక్ష ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. అతి ప్రధానమైన మూడో దశ పనులు పూర్తి చేస్తే ఏడాదికి 60 టీఎంసీల గోదావరి నీటిని ఎగువకు పంపింగ్‌ ‌చేయవచ్చు. మూడో దశలోని ఫస్ట్‌‌, సెకండ్‌‌ ప్యాకేజీ పనులు కంప్లీట్‌‌ అయ్యాయి. మూడో ప్యాకేజీ కింద రామప్ప నుంచి ధర్మసాగర్‌‌ వరకు రూ.1,494 కోట్లతో చేపట్టిన సొరంగ నిర్మాణ పనులు పూర్తికాలేదు. మరో 4 కిలోమీటర్ల  దూరం సొరంగం తవ్వకం పనులు పెండింగ్‌‌ ఉన్నాయి. మిగతా ఐదు ప్యాకేజీల పనులు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ‌మాదిరిగా సమాంతరంగా జరిపితే వచ్చే ఖరీఫ్‌ నాటికైనా ఈ ప్రాజెక్ట్‌‌ను సిద్ధం చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌తో పాటుగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి కూడా నిధులు ఖర్చు చేస్తే 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్ట్‌‌ పూర్తయితే రైతుల కష్టాలు తీరుతాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాతో పాటు కరీంనగర్‌‌, ఖమ్మం, మెదక్‌ ‌జిల్లాల వరకు సాగునీరందుతుంది. 

జూన్‌‌ నాటికి సొరంగం పనులు పూర్తి  

దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల కోసం పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌‌ పెంచాలని భావిస్తున్నాం. దీని కోసం ఫైల్‌ ‌రెడీ అవుతోంది. దేవాదుల మూడో ఫేజ్‌ ‌మూడో ప్యాకేజీ కింద చేపట్టిన రామప్ప టు ధర్మసాగర్‌‌ సొరంగం పనులు 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సొరంగ నిర్మాణ పనులు  స్లోగా జరుగుతున్నాయి. ఈ పనులు కంప్లీట్‌‌ అయితే ఏడాదికి 60 టీఎంసీల నీళ్లను ధర్మసాగర్‌‌ వరకు లిఫ్ట్‌‌ చేయగలం. ఈ పనులను గతంలో కోస్టల్‌‌ కంపెనీ చేపట్టేది. ఇప్పుడు మేగా కంపెనీకి పనుల బాధ్యత అప్పగించాం. పెండింగ్‌‌లో ఉన్న మూడో ఫేజ్‌ ‌పనులను పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరందించేలా ప్లాన్‌ ‌చేస్తున్నాం.
‒ శ్రీనివాస్‌‌రెడ్డి చీఫ్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ, వరంగల్