కాశీ, అయోధ్య అభివృద్ధి వాళ్లకే సమస్య

కాశీ, అయోధ్య అభివృద్ధి వాళ్లకే సమస్య

లక్నో: ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. యూపీకి యోగి సర్కారు ఎంతో అవసరమంటూ.. ‘‘యూపీ+ యోగి = ఉపయోగి” అని చమత్కరించారు. మాఫియా ఆగడాలను అరికట్టి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారని పొగిడారు. రూ. 36,230 కోట్లతో చేపడుతున్న 594 కిలోమీటర్ల గంగా ఎక్స్​ప్రెస్​వే ప్రాజెక్టుకు శనివారం షాజహాన్​పూర్​లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. యూపీలో గత పాలకులు ప్రజాధనాన్ని ఎందుకోసం ఉపయోగించేవారో అందరికీ తెలిసిందేనని, ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ డబ్బును ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో మాఫియా అక్రమాలను  నాలుగున్నరేండ్ల నుంచి యోగి సర్కారు బుల్డోజర్లు కూల్చేస్తుంటే ఆ మాఫియాను పెంచిపోషిస్తున్న వాళ్లకు వణుకుపుడుతున్నదని అన్నారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తుంటాయని, ప్రజా సంక్షేమం వాటికి పట్టదని విమర్శించారు. ‘‘టెర్రరిస్టులపై ఆర్మీ యాక్షన్​, వ్యాక్సిన్​ తయారీ, మేక్​ ఇన్​ ఇండియా స్కీంను వేలెత్తి చూపడమే కొందరి పని. వాళ్లు ఇష్టమున్నట్లు మాట్లాడుతుంటారు. కాశీ, అయోధ్య అభివృద్ధి చెందుతుంటే వాళ్లకు సమస్యగా కనిపిస్తుంది” అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆరు లేన్ల ఎక్స్​ప్రెస్​ వేను మున్ముందు ఎనిమిది లేన్ల ఎక్స్​ప్రెస్​ వేగా అభివృద్ధి చేస్తామని ప్రధాని వెల్లడించారు. ఎక్స్​ప్రెస్​వేలు, ఎయిర్​పోర్టులు, కొత్త రైల్వే రూట్లు.. ఇట్లా అనేక కార్యక్రమాలతో ఉత్తరప్రదేశ్​ముందుకెళ్తోందని, అతి త్వరలోనే ఆధునిక రాష్ట్రంగా మారుతుందని చెప్పారు.