డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం

 డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీలో  గందరగోళం

ఎల్లారెడ్డి/కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం నిర్వహించిన డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీ  గందరగోళానికి దారి తీసింది.  పట్టణ పరిధిలో నిర్మించిన 300 ఇండ్ల పంపిణీ కోసం అధికారులు  మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. 300 ఇండ్లకు 1,456 అప్లికేషన్లు రాగా,  630 అర్హులైన పేదలను గుర్తించారు.  630 నుంచి డ్రా పద్ధతిలో 300 మందిని ఎంపిక చేశారు. మొదటగా ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ లకు ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్​లో తహసీల్దార్​సుధాకర్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. అనంతరం 12 వార్డుల్లో కూడా స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో డ్రా పద్ధతిన ఎంపిక చేశారు.

ఎంపికలో అవకతవకలు..

ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ  ఇండ్లు రాని లబ్ధిదారులు ఎల్లారెడ్డి తహసీల్దార్​ఆఫీస్​ఎదుట  రాస్తారోకో కు దిగారు.  మహిళలు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించడంతో 2 గంటల పాటు ట్రాఫిక్​జామ్​అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్​చైర్మన్​కనుసన్నల్లోనే అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. 30 ఏండ్లుగా అద్దె ఇండ్లల్లో ఉంటున్నా.. ఇల్లు ఇవ్వలేదని వాపోయారు. ఆందోళనకారులకు బీజేపీ లీడర్లు మద్దతుగా రావడంతో పోలీసులు వారిని అరెస్ట్​చేసి పీఎస్​తరలించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఇండ్లు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.  అవకతవకల ఆరోపణపై ఆర్డీవో శ్రీనునాయక్​ వివరణ కోరగా.. ‘డబుల్’ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన తెలిపారు. ఆందోళన కారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై  గణేశ్​తెలిపారు.

 ‘డబుల్’​ ఇండ్లు ఇవ్వాలని కలెక్టరేట్ ​ముట్టడి

కామారెడ్డి మున్సిపల్​పరిధిలోని అర్హులైన పేదలందరికీ డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ గురువారం బీఎల్పీ, బీఎల్ఎఫ్​, బీఎల్టీయూ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్​ను ముట్టడించారు. ఈ నెల 14 న మున్సిపాలిటీలో నిర్వహించిన డ్రా పద్ధతి అర్హుల ఎంపికలో అవకతవకల జరిగాయని సంఘాల లీడర్లు ఆరోపించారు. కార్మిక సంఘ లీడర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీఎల్​టీయూ రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణంలోని 49వ వార్డులో కౌన్సిలర్​బంధువులు, సొంత ఇండ్లు ఉన్నవారికి  ఇచ్చారని ఆరోపించారు.  సర్వే చేయకుండా ఎంపిక చేశారని మండిపడ్డారు. కలెక్టర్​సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించమని బీష్మించారు.  కలెక్టర్​ లేకపోవడంతో ​ఏవో కు వినతి పత్రం అందజేశారు.