మీడియాపై పెరిగిపోతోన్న కార్పొరేట్ శక్తుల ఆదిపత్యం

మీడియాపై పెరిగిపోతోన్న కార్పొరేట్ శక్తుల ఆదిపత్యం
  • రౌండ్​ టేబుల్​ సమావేశంలో వక్తల ఫైర్​

ఖైరతాబాద్ వెలుగు: మీడియా స్వేచ్ఛ పై కార్పొరేట్ శక్తుల ఆదిపత్యం పెరిగిపోతోందని, దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని రౌండ్ టేబుల్ మీటింగ్ లో వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ అధ్యక్షతన ‘మీడియా స్వేచ్ఛ పై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం.. సమాజంపై ప్రభావం’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పాలన ఎప్పుడు ఊహించలేదన్నారు. యువకుల ఓటు హక్కును కాలరాసిన రజత్ కుమార్ కు కేసీఆర్ కీలక పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ నిలువు దోపిడీ చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
కాంట్రాక్టర్​ దోపిడీ: కోదండరామ్
రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఒకే కంపెనీకి ఇస్తున్నారని, అది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సంపదను దోచుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో మీడియా పైనే కాలు మోపుతున్నారని మండిపడ్డారు. దాన్ని ఎదిరించడానికి ఏకమై కొట్లాడాలని పిలుపు ఇచ్చారు.
కలిసి కట్టుగా పోరాడాలె: గాదె ఇన్నయ్య
మీడియా సంస్థలు అన్యాయానికి గురైతే అందరూ కలిసి కట్టుగా పోరాడాలని ఉద్యమ నేత గాదె ఇన్నయ్య అన్నారు. ‘‘అపొజిషన్ లీడర్లు రేవంత్, బండి సంజయ్ ఎవరికి భయపడుతున్నారు?  ఆంధ్రా కాంట్రాక్టర్​కా? కేసీఆర్ కా ? సమాధానం చెప్పాలి”అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని, మీడియాను కాపాడుకోవాలన్నారు. 
పిల్లలకు బీర్​ బాటిళ్లు ఇస్తరా?: పాశం యాదగిరి
తెలంగాణ వద్దన్నవాళ్లు, ఉద్యమకారులను కొట్టినో ళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారని సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కాంట్రాక్టర్లు కూడా మొత్తం ఆంధ్రవాళ్లే అయ్యారని ఆయన మండిపడ్డారు.  కేసీఆర్ బర్త్ డే రోజు చిన్నపిల్లలకు బీర్ బాటిల్స్ ఇచ్చారని, సమాజాం ఎటువైపు పోతోందన్నారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం నడుస్తోందని విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్​ఇక్కడ ఎట్లా ఉంటడు? తరిమికొట్టాలన్నారు. రాజకీయా నేతలకు ఛానెల్స్, పేపర్స్ ఉన్నాయని, కొందరు కనీసం జనం వార్తలు ఇవ్వడం లేదన్నారు.
ఇదేంటని అడగలేని పరిస్థితి: ప్రొ. హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కూడా ప్రజాస్వామ్యం నిలబడలేని స్థితికి చేరిందన్నారు. కొందరు పత్రికలను, ఛానెల్స్ కొనేసి ఇష్టారాజ్యాంగా నడుపుతున్నారన్నారు. ఇదేంటి అని సీఎంను, మంత్రులను ఎవరూ అడగలేని పరిస్థితి వచ్చిందన్నారు. సమాజంలో అసంతృప్తి ఉందని, వివిధ సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. 
పోరాటం చేస్తున్నా..: ఇందిరా శోభన్
ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్నా.. కొన్ని సంస్థలు వార్తలను పబ్లిష్​ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్​అన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ కనుసన్నల్లో  పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము ఓ కాంట్రాక్టర్​పాలైందని మండిపడ్డారు. బీజేపీలో కూడా లోపాయికారీ ఒప్పందంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిపై సీజేఐకి లేఖ రాస్తానని ఆనం చిన్ని వెంకటేశ్వర రావు తెలిపారు. 
వార్తలు రాయొద్దని ఆర్డరా?: శ్రీనివాసరావు
ఒక సంస్థ తమపై వార్తలు రాయొద్దని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని సీనియర్ జర్నలిస్టు  పీవీ శ్రీనివాసరావు అన్నారు. చాలా మంది ఉద్యమ నాయకులు ఆంధ్ర - తెలంగాణ కలిసి ఉంటే బాగుండని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్క యాడ్ ఇస్తే పత్రిక లొంగిపోవాల్సిందేనా అని ఐజేయూ నాయకులు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.