అడ్డామీద కూలీల్లా వీఆర్వోల పరిస్థితి

అడ్డామీద కూలీల్లా వీఆర్వోల పరిస్థితి

ఏ పని చెప్తే ఆ పనికి!

నెల దాటినా వేరే శాఖల్లో అడ్జస్ట్ చేయని సర్కారు 

చీరల పంపిణీ మొదలు  కస్టమ్​ మిల్లింగ్​ దాకా అన్ని పనులకూ వాడుకుంటున్న ఆఫీసర్లు

రిజిస్టర్​ లేదు.. అటెండెన్స్​ లేదు..

అయోమయంలో విలేజ్​ రెవెన్యూ ఆఫీసర్లు

(వెలుగు, నెట్​వర్క్​):  వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి తప్పించిన రాష్ట్ర సర్కారు.. నెలరోజులు దాటినా వేరే శాఖల్లో అడ్జస్ట్​ చేయకపోవడంతో వాళ్ల పరిస్థితి అడ్డా మీది కూలీల్లా తయారైంది. ప్రతిరోజూ ఉదయం తహసీల్దార్​ ఆఫీసులకు వెళ్లడం వాళ్లు ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీకి పోవడమే వీళ్ల డ్యూటీగా మారింది. ప్రాపర్టీ సర్వే, చీరల పంపిణీ , కస్టమ్​ మిల్లింగ్​ పర్యవేక్షణతో పాటు కల్యాణలక్ష్మి అప్లికేషన్లు, క్యాస్ట్​, ఇన్​కాం సర్టిఫికెట్ల వెరిఫికేషన్​.. ఇలా అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. కొందరిని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపడంతో కమిషనర్లకు రిపోర్ట్​ చేస్తున్నారు. కానీ ఎక్కడా వీళ్లకంటూ రిజిస్టర్​గానీ, అటెండెన్స్​గానీ లేకపోవడంతో తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక ఆగమవుతున్నారు.

7వేల మంది వీఆర్వోలు..

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖ​లో పనిచేస్తున్న సుమారు 7వేల మంది వీఆర్వోలను గత నెల 7న  టీఆర్ఎస్​ ప్రభుత్వం ఆ డిపార్ట్​మెంట్​ నుంచి తప్పించింది. అదే రోజు వీఆర్వోల వద్ద ఉన్న పహాణీలు, పీవోటీలు, టిప్పన్లు, గ్రామపటాలు ఇతరత్రా అన్ని రకాల రికార్డుల ఒరిజినల్, జిరాక్స్​, ప్రింటెడ్​ కాపీలను తహసీల్దార్లు స్వాధీనం చేసుకొని కలెక్టర్లకు అందజేశారు. అన్ని రికార్డులు సమర్పించినట్లు వీఆర్వోల నుంచి ‘నిల్​ డిక్లరేషన్’​ కూడా తీసుకున్నారు. వీఆర్వోలపై అవినీతి ఆరోపణలు పెరుగుతుండడం, భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రికార్డులన్నీ డిజిటలైజ్​ చేయడం, కాస్తు కాలమ్​ కూడా తొలగించడంతో భూపరిపాలనలో ఇక వీఆర్వోల అవసరం లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే రెవెన్యూ నుంచి పక్కనపెట్టిన వీఆర్వోలందరినీ ఇతర శాఖల్లో అడ్జస్ట్​ చేయాలని భావించారు. వారందరికీ జూనియర్​ అసిస్టెంట్​ క్యాడర్​ పోస్టింగ్​ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2వేల మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ప్రపోజల్స్​ వచ్చాయి. సుమారు 18 డిపార్ట్​మెంట్ల నుంచి జూనియర్​ అసిస్టెంట్​ క్యాడర్ పోస్టుల వివరాలను కూడా తీసుకున్న ఉన్నతాధికారులు ఇప్పటివరకు వీఆర్వోలను ఎక్కడా సర్దుబాటు చేయలేదు. ఆఫీసర్లు మాత్రం అగ్రికల్చర్​, ఇరిగేషన్​, పంచాయతీరాజ్​, మున్సిపల్ డిపార్ట్​మెంట్లలోనే అడ్జస్ట్ చేస్తామని, పేరు మార్చి రెవెన్యూలోనే కొనసాగిస్తామని వీఆర్వోలకు చెబుతున్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

జిల్లాకో తీరు డ్యూటీలు..

తమ డిపార్ట్​మెంట్​పై , విధులపై క్లారిటీ లేని వీఆర్వోలతో అధికారులు జిల్లాకో తరహా డ్యూటీలు చేయిస్తున్నారు. మెజారిటీ వీఆర్వోలు ఇటీవల ప్రారంభమైన ప్రాపర్టీ సర్వేలో పాల్గొంటుండగా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, జగిత్యాల, మెదక్​ లాంటి జిల్లాల్లోని వీఆర్వోలకు  రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేసి,​ కస్టమ్​ మిల్లింగ్​ టార్గెట్​ పెట్టారు. ​కరీంనగర్​ జిల్లాలోని వివిధ మండలాల్లోని వీఆర్వోలను బతుకమ్మ చీరల పంపిణీకి వాడుకుంటున్నారు.  మెదక్​ జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాల వీఆర్వో లను దుబ్బాక ఉప ఎన్నికల ఏర్పాట్ల కోసం వాడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వీఆర్వో లను బతుకమ్మ చీరల పంపిణీ, పల్లె ప్రకృతి వనాల పనుల పర్యవేక్షణ డ్యూటీలు అప్పగించారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో కొందరు వీఆర్వోలు ప్రాపర్టీ సర్వేలో పాల్గొంటుండగా, కొందరు తహసీల్దార్​ ఆఫీసుల్లోనే ఉండి అధికారులు చెప్పిన పనులు చేస్తున్నారు. వరంగల్ రూరల్​ జిల్లాలోని వీఆర్వోలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​లో షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. మిగిలిన వీఆర్వోలను తహసీల్దార్​ ఆఫీసుల్లోనే వివిధ పనులకు ఉపయోగించుకుంటున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో వీఆర్వోలను కల్యాణలక్ష్మి, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్​ తదితర అప్లికేషన్ల ఎంక్వైరీకి పంపిస్తున్నారు. వీరంతా తహసీల్దార్లకు రిపోర్ట్​ చేస్తున్నారు.  ఆదిలాబాద్​ జిల్లాలోని మెజారిటీ వీఆర్వోలు మున్సిపల్​, జీపీల్లో చేపడుతున్న ప్రాపర్టీ సర్వేలో పాల్గొంటూ కొందరు మున్సిపల్ కమిషనర్ల​కు, ఇంకొందరు జిల్లా పంచాయతీ అఫీసర్ల కు రిపోర్ట్ చేస్తున్నారు. జనగామ జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదిక ల నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. గద్వాల జిల్లాలోని వీఆర్వోలను గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రాపర్టీ సర్వేకు వినియోగించుకుంటున్నారు. కొందరిని కల్యాణ లక్ష్మి తదితర అప్లికేషన్ల పరిశీలనకు వెళ్తున్నారు. ఎక్కడ సంతకాలు చేయకుండానే ఆఫీస్ కి వచ్చి తిరిగి వెళ్లి పోతున్నారు. ఇలాంటి క్లారిటీ లేని డ్యూటీలు తమకు వద్దని, వెంటనే ఏదో శాఖలో పోస్టింగ్​ ఇవ్వాలని వీఆర్వోలు డిమాండ్​ చేస్తున్నారు.

తహసీల్దార్ ఎటు పొమ్మంటే అటు పోతున్నం..

నెల రోజులుగా ఉదయం తహసీల్దార్ ఆఫీస్ కి పోతున్నం. సారు ఏ డ్యూటీ కి వెళ్లమంటే ఆ డ్యూటీకి వెళ్తున్నం. డ్యూటీ లేనప్పుడు ఎప్పుడు ఏ అవసరం పడుతదో అని అక్కడే ఉంటున్నం. ఇలా క్లారిటీ లేని డ్యూటీలు కష్టం. మమ్మల్ని త్వరగా ఏదో ఒక డిపార్ట్​మెంట్​లో అడ్జస్ట్​ చేయాలి. –రాజయ్య, వీఆర్వోల సంఘం జిల్లా ప్రెసిడెంట్, జగిత్యాల

ఈ నెల జీతం ఇంకా రాలేదు

పోయిన నెల 7వ తేదీ నుంచి నాకు లక్షెట్టిపేట మండలం మిట్టపల్లిలోని శ్రీరామ రైస్ మిల్లులో డ్యూటీ వేశారు. పొద్దున 8 నుంచి రాత్రి 8 దాకా 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి డీఎస్వో ఆఫీసులోని సీఎమ్మార్ సెల్ కు ఫోన్ చేసి ఎన్ని వడ్లు మిల్లింగ్ చేశారు, ఎంత రైస్ వచ్చింది, క్వాలిటీ ఎట్లుందో రిపోర్ట్ చేయాలె. ఈ నెల ఇంకా జీతం రాలేదు. మమ్మల్ని   గిట్ల ఇబ్బంది పెట్టే బదులు ఏదో ఒక డిపార్ట్మెంట్ల మెర్జ్ చేస్తే బాగుంటుంది. మాతో పని లేదని ప్రభుత్వం భావిస్తే వీఆర్ ఎస్ ఇస్తే మా బతుకేదో మేం బతుకుతం. – మోహన్, చందారం వీఆర్వో, మంచిర్యాల జిల్లా.