తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం కోడి పందేలు, గాలిపటాలే కాదు.. అంతకు మించి బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాల సందడి. 2026 సంక్రాంతి బరి మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. అగ్ర కథానాయకుల నుంచి క్రేజీ యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది జనవరిలో థియేటర్ల వద్ద భారీ పోటీ ఖాయమనిపిస్తోంది.
ది రాజా సాబ్: ప్రభాస్ హారర్ కామెడీ విందు
సంక్రాంతి హడావుడిని అందరికంటే ముందే ప్రారంభించబోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే విభిన్నమైన హారర్-కామెడీ జానర్‌లో వస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్, మారుతి కామెడీ టైమింగ్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
దళపతి విజయ్ 'జన నాయకుడు'తో సవాల్
జనవరి 9న ప్రభాస్‌కు గట్టి పోటీ ఇస్తూ, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన చివరి చిత్రంతో థియేటర్లలోకి వస్తున్నారు. 'జన నాయకుడు' పేరుతో రాబోతున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న తరుణంలో వస్తున్న సినిమా కావడంతో, తమిళంతో పాటు తెలుగులోనూ దీనిపై విపరీతమైన క్రేజ్ ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రభాస్ 'రాజా సాబ్'తో ఢీకొట్టడం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరుగా మారనుంది.
మన శంకర వరాప్రసాద్ గారు: మెగా మాస్ ఎంటర్టైనర్
మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతి బరిలోకి వస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరాప్రసాద్ గారు' సినిమా జనవరి 12న విడుదల కానుంది. మెగాస్టార్ మ్యానరిజమ్స్, అనిల్ రావిపూడి హిలేరియస్ కామెడీ మిక్స్ అయితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇందులో వెంకటేష్ కూడా కీలక పాత్రలో ఉండటంతో మెగా, వెంకీ అభిమానులు ఈ చిత్రం కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి: మాస్ రాజా సందడి
సంక్రాంతి రేసులో తన స్పీడ్ చూపిస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న వస్తోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రవితేజ ఎనర్జీ, కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాను విన్నర్‌గా నిలబెడతాయని చిత్రయూనిట్ ధీమాగా ఉంది.
అనగనగా ఒక రాజు: నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో జనవరి 14న బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ చేస్తున్న పూర్తిస్థాయి కామెడీ కావడంతో, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
'నారీ నారీ నడుమ మురారి'
వీటితో పాటు శర్వానంద్ హీరోగా, సంయుక్త , సాక్షి వైద్య కీలక పాత్రలో నటించిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ కూడా జనవరి 14న రిలీజ్ కానుంది. సంక్రాంతి వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యాయి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది.
మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్‌కు ఒక భారీ పండుగ కాబోతోంది. మరి ఈ స్టార్ల పోరులో ఎవరు 'సంక్రాంతి విజేత'గా నిలుస్తారో చూడాలి!
