చెల్లిని వేధిస్తున్న యువకుడిపై కత్తితో దాడి చేసిన అన్న

చెల్లిని వేధిస్తున్న యువకుడిపై కత్తితో దాడి చేసిన అన్న
  • తల్లిదండ్రులతో కలసి యువకుడి ఇంటికి వెళ్లి నచ్చచెప్పినా వినకపోవడంతో కత్తితో దాడి

రంగారెడ్డి జిల్లా: మెయినాబాద్ లో చెల్లిని వేధిస్తున్న షేక్ హబీబ్ ( 21) అనే యువకుడిపై 17 ఏళ్ల మైనర్ అన్న కత్తితో దాడి చేశాడు. తల్లిదండ్రులతో కలసి యువకుడి ఇంటికి వెళ్లి పద్ధతి కాదని నచ్చచెప్పినా.. యువకుడు పట్టించుకోపోవడంతో కోపంతో రగిలిపోయిన బాలిక అన్న (17 ఏళ్ల మైనర్) కత్తితో దాడి చేశాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 
మా అమ్మాయి జోలికి రావొద్దని చెప్పినా వినడం లేదని..
మెయినాబాద్ కు చెందిన ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికను షేక్ హబీబ్ (21) తరచూ వెంబడిస్తూ..  ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ విషయం బాలిక తన ఇంట్లో చెప్పగా.. తల్లిదండ్రులు బాలుడి ఇంటికి వెళ్లి నచ్చచెప్పారు. మా అమ్మాయి జోలికి రావద్దని చెప్పినా.. షేక్ హబీబ్ పట్టించుకోలేదు. మళ్లీ పాత పద్ధతిలోనే వెంటపడుతున్నాడు. ఇదేకోవలోనే నిన్న శుక్రవారం ఇంటిబయటకు వెళ్లిన బాలికను వెంబడించాడు. చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేయగా బాలిక ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బాలిక అన్న కలసి షేక్ హబీబ్ ఇంటికి వెళ్లి.. జరిగిన విషయం చెప్పారు. మా అమ్మాయి జోలికి రాకుండా చూడాలని తల్లిదండ్రులకు చెబుతుండగా మాటమాటా పెరగింది. వాగ్వాదం పెరిగి పెద్దది కావడం చూసిన బాలిక అన్న కోపోద్రికుడై కత్తి తీసుకొచ్చి షేక్ హబీబ్ పై దాడి చేశాడు. హఠాత్తు ఘటన కలకలం రేపగా గాయపడిన హబీబ్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.