
తూప్రాన్(మనోహరాబాద్ ), వెలుగు: ఆరోగ్యంగా లేని కోళ్లను కోసుకుని తిన్న అక్కాతమ్ముడు మృతిచెందగా, తల్లికి సీరియస్‌గా ఉంది. మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లేశ్, బాలమణి భార్యాభర్తలు. మనోహరాబాద్మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫాంలో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు మనీషా(13) కుమార్ (10). రెండు రోజుల క్రితం ఫాంలో పెంచిన కోళ్లను ఓనర్ ఐలయ్య యాదవ్ విక్రయించాడు. ఆ టైంలో ఆరోగ్యంగా లేని కొన్ని కోళ్లను బాలమణి షెడ్లోనే ఉంచింది. వాటిలో కొన్నింటిని సోమవారం రాత్రి కోసి వండింది. మల్లేశ్, ఫాం ఓనర్ మరో ఫ్రెండ్‌తో కలిసి బయట భోజనం చేయగా, బాలమణి, ఆమె పిల్లలు ఇంట్లో చికెన్ తిని పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మల్లేశ్ వారిని తూప్రాన్ గవర్నమెంట్ హస్పిటల్ కు తీసుకెళ్లాడు. అప్పటికే మనీషా, కుమార్ చనిపోయారు. బాలమణిని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.