ఆసరా’ అందట్లే: పాతవి ఆపిన్రు.. కొత్తవి ఇస్తలేరు

ఆసరా’ అందట్లే: పాతవి ఆపిన్రు.. కొత్తవి ఇస్తలేరు

పాతవి ఆపిన్రు.. కొత్తవి ఇస్తలేరు
ప్రజావాణి కంప్లయింట్స్లో ఇవే ఎక్కువ
పలుమార్లు తిరిగినా ఫలితం లేదంటున్న బాధితులు
అక్నాలెడ్జ్​మెంట్లు ఇవ్వని అధికారులు.. కలెక్టర్​ ఆదేశాలు బేఖాతరు

సిటీలో ఆసరా పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు అవస్థ పడుతున్నారు. అప్లయ్​ చేసి ఏండ్లు గడుస్తున్నా రాని వారు కొందరైతే, వస్తున్న పింఛన్​ అర్ధాంతరంగా ఆగిపోయిన బాధితులు మరికొందరు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎక్కువ కంప్లయింట్స్​ ఇవే వచ్చాయి. గ్రీవెన్స్​​ సెల్ మొక్కుబడిగా సాగడంతో వ్యయప్రయాసలకోర్చి ఉన్నతాధికారులకు సమస్యలు చెప్పుకొందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ప్రతీ కంప్లయింట్​ఆన్​లైన్ ​చేసి, ఫిర్యాదుదారులకు అక్నాలెడ్జ్​మెంట్​ ఇవ్వాలని లాస్ట్​ వీక్ ​కలెక్టర్​ సీరియస్​గా చెప్పినా అధికారులు పట్టించుకోలేదు.

హైదరాబాద్‍, వెలుగు: సిటీలో ఆసరా పింఛన్లు అందక వృద్ధులు, విడోలు అష్టకష్టాలు పడుతున్నారు. అనేక మంది తమ గోడు వెళ్లబోసుకునేందుకు సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని ప్రజావాణి ఆన్‍లైన్‍లో నమోదు చేసి ఫిర్యాదుదారులకు అక్నాలెడ్జ్ మెంట్‍ ఇవ్వాలి.  అనంతరం సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత డిపార్టుమెంట్‍ అధికారులకు ట్రాన్స్ ఫర్‍ చేయాల్సి ఉంటుంది. ఆన్‍లైన్‍లో నమోదైన ప్రతి సమస్యను కలెక్టర్‍ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజల సమస్య కొంత వరకు తీరే అవకాశం ఉంటుంది. కానీ కలెక్ట రేట్​సిబ్బంది ప్రజల సమస్యలను ఆన్‍లైన్‍లో నమోదు చేయకుండానే అధికారుల దగ్గరకు నేరుగా పంపిస్తున్నారు. వారు సంబంధిత డిపార్టుమెంట్ల అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. ఆయా డిపార్టుమెంట్‍ అధికారులు మాత్రం రేపు వచ్చి ఆఫీస్‍లో కలవమని చెప్పి పంపిస్తున్నట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు. గత వారం ప్రజావాణిలో ఇలా చేయడం సరికాదని కలెక్టర్‍ శ్వేతా మహంతి చెప్పినా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు.

22 దరఖాస్తులు వచ్చాయ్‍

కలెక్టరేట్‍లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 50 వరకు దరఖాస్తులు రాగా, 22 ఫిర్యాదులు ఆన్​లైన్​లో రిజిస్టర్​ అయినట్లు అడిషనల్‍ కలెక్టర్‍ ఎం.కృష్ణ తెలిపారు.  లా ఆఫీసర్‍ సంగీత, ఆర్డీఓలు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పట్టాలివ్వండి

సరూర్‍నగర్‍ శంకేశ్వర్‍ బస్తీలో పట్టాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని20 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలో దాదాపు 120 కుటుంబాలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నామన్నారు. ఇందులో 100 కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, మిగిలిన వారికి మాత్రం ఇయ్యలేదన్నారు. ఎంఆర్‍ఓ ఆఫీస్‍, కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్‍ ఇలా కార్యాలయ చుట్టు తిరిగి అధికారులు తమ గోడును తెలిపినా న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు.

జీతాలిప్పించండి సారూ..

19 నెలలుగా జీతాలు ఇయ్యట్లేదని 14 మంది డీఎంఎచ్‍ఓ  ఎస్‍పీహెచ్‍ఓ వెహికిల్స్ డ్రైవర్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెహికల్ ఫైనాన్స్,
మెయింటనెన్స్, ఇంటి అద్దెలు,  స్కూల్‍ ఫీజులు, ఇతర ఖర్చులకు ఇంట్లో బంగారం కుదువ పెట్టి నెట్టుకొచ్చే పరిస్థితి ఉందని వాపోయారు.
ఆగస్టు 2018 నుంచి ఆగస్టు2019 వరకు సుమారు రూ.61.88 లక్షల జీతాల బడ్జెట్‍ రిలీజ్​కాలేదని వాపోయారు.