317 జీవోతో మా బతుకులు ఆగమైనయ్

317 జీవోతో మా బతుకులు ఆగమైనయ్
  •     జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలి
  •     పొన్నం ప్రభాకర్​ను కోరిన ఉద్యోగులు
  •     గత బీఆర్ఎస్ సర్కార్​ది అనాలోచిత నిర్ణయమని వెల్లడి
  •     మంత్రివర్గంలో చర్చించి న్యాయం చేస్తామన్న మంత్రి

హుస్నాబాద్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన జీవో 317తో తమ బతుకులు ఆగమయ్యాయని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత లేకుండా మెరిట్, సీనియారిటీ ఆధారంగా చేపట్టిన బదిలీలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జీవో బాధితులు ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో స్థానిక, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ కావాలనే విభజన ప్రక్రియ చేపట్టి నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఏకపక్షంగా జీవో తెచ్చి మమ్మల్ని ట్రాన్స్​ఫర్ చేసింది. ఈ జీవో.. స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీచర్లను వేరే జిల్లాలకు, జోన్లకు బదిలీ చేసి స్థానికత కోల్పోయేట్టు చేసింది. కొందరు టీచర్లు బీఆర్ఎస్ లీడర్ల పైరవీలతో నగరాలు, పట్టణాల్లో పోస్టులు పొందారు. వారికంటే ఎక్కువ సీనియార్టీ ఉన్నవాళ్లను బీఆర్ఎస్ సర్కార్ మారుమూల ప్రాంతాలకు  ట్రాన్స్​ఫర్​ చేసింది’’అని 317 జీవో బాధితులు మండిపడ్డారు.

కొత్త జోనల్ వ్యవస్థ లక్ష్యం నీరుగారింది

స్థానికతను విస్మరించడంతో కొత్త జోనల్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం నీరుగారిపోయిందని బాధితులు మంత్రికి వివరించారు. 317 జీవో ఉప సంహరించుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. కాగా, 2023కు వీడ్కోలు పలుకుతూ హుస్నాబాద్​లోని తన ఇంట్లో కేక్ కట్ చేసి 2024కు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు వచ్చే వాళ్లంతా బొకేలు, శాలువాలు కాకుండా.. నోట్ బుక్స్ తీసుకురావాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో 317 జీవో బాధితులు బూట్ల రాజమల్లయ్య, దత్తాత్రేయ, కాయిత శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్, లక్ష్మారెడ్డి, పంజా మల్లయ్య, సాధిక్, శ్రీనివాస్, వినీత్, ఏఎన్ఎం బేగ్ ఉన్నీసా తదితరులు ఉన్నారు.

1,080 కొత్త బస్సులు

తిమ్మాపూర్, వెలుగు: మహిళల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జనవరిలో 1,080 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలుష్యాన్ని నివారించేందుకు మూడు నెలల్లో మరో వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వీటిలో జంట నగరాలకు 500 బస్సులు, జిల్లాల్లో 500 బస్సులను తిప్పుతామని అన్నారు. ఆదివారం కరీంనగర్​జిల్లా ఎల్ఎండీలో కాకతీయ కాల్వకు నీటి విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.