ఫీల్డ్ అసిస్టెంట్ల గోస

ఫీల్డ్ అసిస్టెంట్ల గోస
  • సీఎం చెప్పి రెండు నెలలైనా జాబ్‌‌‌‌లోకి తీసుకోలే
  • 7,651 మంది ఎదురుచూపులు
  • పంచాయతీ సెక్రటరీలతోనే ఉపాధి హామీ పనులు
  • డ్యూటీలోకి ‌‌‌‌తీసుకుంటారో లేదోనని ఎఫ్ఏల ఆందోళన

హైదరాబాద్, వెలుగు : ‘‘ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటం. మరోసారి వారు పొరపాటు చేయొద్దు. ఎంతో మందికి ఎన్నో చేసినం. వారికి మాత్రం ఎందుకు చేయం’’.. మార్చి 15న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కానీ ఆయన హామీ ఇచ్చి 54 రోజులవుతున్నా ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఉపాధి హామీ పథకంలో లక్షలాది మంది కూలీలతో పనులు చేయించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి కరువైంది. సమ్మె చేశారనే కారణంతో రెండేండ్లుగా వారిని రాష్ట్ర సర్కార్ పక్కనపెట్టింది. దీంతో ఎఫ్‌‌‌‌ఏల కుటుంబాలు అర్ధాకలితో నెట్టుకొస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో జోరుగా సాగుతున్న ఉపాధి పనులను పంచాయతీ సెక్రటరీలతోనే చేయిస్తున్నారు. దీంతో తమను డ్యూటీలోకి తీసుకుంటారో లేదోనని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. సర్కార్ ఉత్తర్వుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఎఫ్ఏలు ఎదురుచూస్తున్నారు.

సమ్మె చేశారనే సాకుతో..
2019 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన 4779/2019 సర్క్యులర్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా సమ్మె చేశారన్న సాకుతో ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం మూకుమ్మడిగా సస్పెండ్ చేసింది. సమ్మె సమయంలో పని చేసిన సుమారు 250 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా 2020 మే చివర్లో తొలగించింది. దీంతో ఎఫ్‌‌‌‌ఏలను తీసేయడానికి సమ్మెను సర్కార్ ఓ సాకుగా మాత్రమే వాడుకుందని, ఎలాగైనా వారిని తొలగించాలని ముందే నిర్ణయించుకుందని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు సర్కారు అప్పజెప్పింది. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలో సర్కార్ వ్యతిరేక ప్రచారం

తమను విధుల్లోకి తీసుకోవాలని ఉద్యమిస్తూనే మంత్రుల చుట్టూ తిరిగారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌కు అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. అయినా వారిపై సర్కార్ దయ చూపలేదు. దీంతో తమ నిరసన గళం వినిపించేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు. తమ ఉద్యోగాలు తీసేశారంటూ ఆ ఎన్నికల్లో వారు చేసిన ప్రచారం టీఆర్ఎస్‌‌‌‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించగా.. ఎనిమిది వారాల్లోపు వారిని విధుల్లోకి తీసుకోవాలని 2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యతిరేకత భవిష్యత్‌‌‌‌లో మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని సర్కారు భావించింది. అందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మార్చి 15న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని ప్రకటించారనే చర్చ అప్పట్లో వినిపించింది. నెలన్నర రోజులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్‌‌‌‌ రావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ను పలుమార్లు కలిసినా డ్యూటీలోకి చేర్చుకోలేదు.

పంచాయతీ సెక్రటరీలపై పని భారం
గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవటంతో పంచాయతీ సెక్రటరీలపై తీవ్రమైన పనిభారం పడుతోంది. అన్ సీజన్ లోనూ కనీసం రోజుకు 50 మంది కూలీలు పనులకు హాజరుకావాలని సెక్రటరీలపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కూలీల హాజరును పరిశీలించే అసిస్టెంట్లు లేకపోవటంతో సెక్రటరీలకు ఆ పని అప్పగించారు. పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం మొక్కల సంరక్షణ, ఇంటి పన్నుల వసూలు, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాల నిర్వహణతో సెక్రటరీలకు ఉపాధి హామీ పనుల నిర్వహణ భారంగా మారింది.

ఇప్పటికైనా ఆదుకోవాలె
రెండేండ్లుగా ఎలాంటి పనుల్లేక అవస్థలు పడుతున్నం. సాఫ్ట్ వేర్‌‌‌‌‌‌‌‌లో మా పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగుతుండడంతో చివరికి మాకు అదే ఉపాధి హామీ పనులకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పటికైనా మమ్మల్ని విధుల్లోకి తీసుకుని, మా కుటుంబాలను ఆదుకోవాలి.
‌‌‌‌‌‌‌‌- చెలమల్ల వీరన్న, ఫీల్డ్ అసిస్టెంట్, పెద్ద నాగారం, మహబూబాబాద్ జిల్లా

ఇప్పటికైనా తీసుకోండి
రెండేండ్లుగా అర్ధాకలితో నెట్టుకొస్తున్నం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాలుగా ఆందోళనలు చేశాం. హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ మా నిరసన ప్రకటించాం. రాష్ట్రంలో మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ కలుస్తున్నం. అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించినట్లుగా మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోవాలి. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల వివిధ కారణాలతో సుమారు 80 మంది వరకు చనిపోయారు. 
‑ ముదిగొండ శ్యామలయ్య, అధ్యక్షుడు, రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం