దేశంలో గ్రామీణ ఉపాధికి భద్రత కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త చట్టానికి 'వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్): VB-G RAM G బిల్లు, 2025' అని నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత బిల్లు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలకమైన, అత్యంత ప్రభావవంతమైన మార్పులను తీసుకురానుంది.
ప్రస్తుతం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్కీమ్ కింద గ్రామీణ కుటుంబాలకు ఏటా 100 రోజులు వేతన ఉపాధికి హామీ లభిస్తోంది. కొత్తగా రాబోయే VB-G RAM G బిల్లు ఈ హామీ పనిరోజులను 125 రోజులకు పెంచనుంది. అంటే ఏడాదిలో నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధపడే ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు 125 రోజులు ఉపాధికి చట్టపరమైన హామీ లభిస్తుంది. ఈ బిల్లు లక్ష్యం కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా, 'వికసిత్ భారత్ 2047' జాతీయ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి దోహదపడనుంది. దీంతో సాధికారత, అభివృద్ధి, సమ్మిళితత్వం ద్వారా సుసంపన్నమైన గ్రామీణ భారతదేశాన్ని ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది.
అయితే కొత్త బిల్లులో తీసుకురానున్న అత్యంత ముఖ్యమైన మార్పు నిధుల పంపిణీ విధానం. ప్రస్తుతం ఉన్న విధానంలో చెల్లించే వేతనాల ఖర్చును కేంద్ర ప్రభుత్వం 100% భరిస్తుంది. మెటీరియల్ ఖర్చులో 75% భారం కేంద్రంపై ఉంటుంది. అయితే కొత్త బిల్లులో మెుత్తం ఖర్చులో నిధుల సమీకరణను 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం అని చెప్పుకోవచ్చు. పాత పథకంలో వేతన ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించగా, కొత్త చట్టం ద్వారా రాష్ట్రాలు ఆ భారాన్ని పంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్ చేయాల్సి ఉంటుంది ఖర్చులను. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. దేశంలో గ్రామీణ ఉపాధి భద్రత విధానం పూర్తిగా మారిపోనుందని చెప్పుకోవచ్చు.
