లిక్కర్ స్కామ్‌‌.. ఇయ్యాల ఈడీ ముందుకు పిళ్లై, బుచ్చిబాబు

లిక్కర్ స్కామ్‌‌.. ఇయ్యాల ఈడీ ముందుకు పిళ్లై, బుచ్చిబాబు
  • షెల్‌‌ కంపెనీలు, అకౌంట్స్‌‌పై ఆరా తీయనున్న అధికారులు

  • శరత్‌‌ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు మరో 4 రోజుల కస్టడీ

  • సమీర్ మహేంద్రుకి ఈ నెల 26 వరకు జ్యుడీషియల్‌‌ కస్టడీ

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌‌ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) కీలక వివరాలు రాబడుతున్నది. కస్టడీలో ఉన్న అరబిందో ఫార్మా ఫుల్‌‌టైమ్ డైరక్టర్ శరత్‌‌చంద్రారెడ్డి, బినోయ్‌‌బాబులను సమగ్రంగా విచారిస్తున్నది. శరత్‌‌చంద్రారెడ్డికి చెందిన ఆర్థిక మూలాలను బయటకు తీస్తున్నది. ఈ క్రమంలో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్‌‌‌‌ అరుణ్‌‌ రామచంద్ర పిళ్లై, ఆయా కంపెనీలకు చెందిన చార్టెడ్‌‌ అకౌంటెంట్‌‌ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది. రామచంద్రపిళ్లై, బుచ్చిబాబు శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఈ కేసులో భాగంగా సెప్టెంబర్‌‌‌‌ 16, 17 తేదీల్లో గోరంట్ల అసోసియేట్స్‌‌లో ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో షెల్‌‌ కంపెనీలు, రాష్ట్రంలోని పలువురు కీలక నేతలకు సంబంధించిన కంపెనీల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. షెల్‌‌ కంపెనీల ఆధారంగా లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో డబ్బులు చేతులు మారిన అకౌంట్స్‌‌ను గుర్తించారు. ఆయా కంపెనీలు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఆఫీసర్లు రాబట్టనున్నారు. ప్రధానంగా బుచ్చిబాబు నిర్వహించిన అకౌంట్స్‌‌తో షెల్‌‌ కంపెనీలు, బినామీల వివరాలపై ప్రశ్నించనున్నారు.

ఏపీ, తెలంగాణ లీడర్లకు నోటీసులు

లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌ కేసులో ఏపీ, తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. శరత్‌‌చంద్రారెడ్డి, రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబుల స్టేట్‌‌మెంట్స్ ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రధానంగా షెల్ కంపెనీలకు డైరెక్టర్స్‌‌గా ఉన్న 15 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారించినట్లు తెలిసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రముఖులను విచారించాల్సి ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

విచారణకు సహకరిస్తలే

ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ సీబీఐ స్పెషల్‌‌ కోర్ట్ అనుమతితో గత శుక్రవారం నుంచి శరత్‌‌చంద్రారెడ్డి, బినోయ్‌‌బాబులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారంతో కస్టడీ ముగియడంతో వారని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు సహకరించలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్‌‌లో మనీలాండరింగ్‌‌ పూర్తి వివరాలు రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్ట డీకి ఇవ్వాలని కోరారు. శరత్‌‌చంద్రా రెడ్డి కి బెయిల్‌‌ ఇవ్వకూడదన్నారు. బెయిల్‌‌ మం జూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే చాన్స్​ ఉందని తెలిపారు. బినోయ్ బాబు విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా సోదాలు నిర్వహించినట్లు చెప్పారు.

డిజి టల్ ఆధారాలు సేకరించామన్నారు. నింది తుల తరఫు న్యాయవాదులు మాత్రం రెండు రోజులు కస్టడీకే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. 4రోజుల కస్టడీకి అనుమతి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శరత్‌‌చంద్రారెడ్డి, బినోయ్‌‌బాబులను ఈడీ అధికారులు కస్టడీ తీసుకున్నారు. తీహార్ జైలులోని స్పెషల్ రూమ్‌‌లో విచారిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుని ఈడీ అధికారులు కోర్టులో హజరుపరిచారు. సీబీఐ కోర్ట్ ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.