ఇంకో 4 రోజులే గడువుంది! 

ఇంకో 4 రోజులే గడువుంది! 

బిజినెస్ డెస్క్, వెలుగు:ప్రతి ఉద్యోగి/కార్మికుడు వెంటనే తమ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఆధార్ కార్డ్‌‌‌‌తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉందని ప్రకటించింది. లేకపోతే కంపెనీలు/సంస్థ యజమానులు వాళ్ల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలోకి డబ్బు జమ చేయడం సాధ్యం కాదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడమూ వీలుకాదు. వచ్చే నెల నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. ఆధార్‌‌–యూఏఎన్‌‌ సీడింగ్‌‌ కోసం కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 142ను సవరించింది. కొత్త విధానం గురించి లీగల్ ఎక్స్ పర్ట్‌‌ వైభవ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఇక నుంచి పీఎఫ్‌‌ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే, ఆధార్ నంబర్–యూఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని అన్నారు. రెంటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు, ఇతర ఈపీఎఫ్ఓ సేవలు కూడా ఆగిపోతాయని చెప్పారు. పెన్షన్ ఫండ్‌‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది.  పెన్షన్ ఫండ్‌‌కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు.  కంట్రిబ్యూషన్లు డిపాజిట్ చేయకపోవడం వల్ల యజమానులు/కంపెనీలుగా కూడా డిఫాల్టర్లు అవుతారు. ఫలితంగా చట్టప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్‌‌ను డిపాజిట్ చేయడం కూడా వీలపడదు. ఈ ఏడాది జూన్‌‌ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్‌‌ఓ ఇది వరకే ప్రకటించింది.