రెండేండ్లుగా బాత్రూంలోనే ఉంటున్న కుటుంబానికి నీడ దొరికింది

రెండేండ్లుగా బాత్రూంలోనే ఉంటున్న కుటుంబానికి నీడ దొరికింది

పెండ్లయిన కొన్నేళ్లకు భర్త చనిపోయాడు. ఉంటున్న పూరిల్లు కూడా కొన్నాళ్లకు కూలిపోయింది. ఎటు పోవాలో తెలియక పంచాయతీ కమిటీ హాలులో ఆ కుటుంబం తలదాచుకుంటే కొన్నాళ్లకు ఖాళీ చేయించారు. చివరికి తమ ఇంటి ముందున్న బాత్రూమ్​నే ఇల్లుగా చేసుకుందా కుటుంబం. వండుడు, తినుడు, పండుకునుడు అంతా మరుగుదొడ్డిలోనే. వారం కాదు, నెల కాదు.. గత రెండేండ్లుగా అక్కడే ఉంటోంది. ఇద్దరు పిల్లలను రోజూ లోపల పడుకో బెట్టి అత్తాకోడలు బయట పడుకుంటున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి.. కొత్త ఇళ్లు కట్టించారు. 

మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన గుమ్మడి బాలయ్య, సుజాత(30) భార్యాభర్తలు. వీరికి భాను(10), విన్నీ(7) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేండ్ల క్రితం బాలయ్య అనారోగ్యంతో చనిపోగా అప్పటి నుంచి అత్త అంజమ్మ, ఇద్దరు పిల్లలతో సుజాత పూరింట్లోనే ఉండేది. ఇద్దరూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బాలయ్య చనిపోయిన కొన్ని నెలలకే ఇల్లు కూలిపోయింది. దాంతో ఎటు వెళ్లాలో తెలియక ఆ పేద కుటుంబం గ్రామ పంచాయతీకి చెందిన కమిటీ హాలులో తలదాచుకుంది. కొన్నాళ్లకు పంచాయతీకి చెందిన సామగ్రి పెట్టాలని గ్రామ పెద్దలు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. చేసేదేమీ లేక ఇంటి స్థలం గతంలో ప్రభుత్వం కట్టించిన మరుగుదొడ్డిని సుజాత, అంజమ్మ ఇంటిగా మార్చుకున్నారు. రెండేండ్లుగా అందులోనే ఉంటున్నారు. వండుకునేది, తినేది అన్నీ బాత్రూంలోనే. ఎండైనా, వానైనా ఇద్దరు పిల్లలను బాత్రూంలో పడుకోబెట్టి మహిళలిద్దరూ బయట పడుకుంటున్నారు. అయితే వీరి బాధను ప్రభాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తులు అర్ధంచేసుకొని.. పెద్ద మనసుతో ముందుకొచ్చారు. అందరూ కలిసి డబ్బులు సేకరించి ఆ నిరుపేద కుటుంబానికి ఓ నీడ కల్పించారు. ఆ కుటుంబానికి సరిపోయేట్లుగా ఓ ఇల్లు కట్టించారు. ఆ ఇంటిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో ఈ రోజు ఓపేనింగ్ చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెబుతుందే తప్ప ఇవ్వడం లేదని ఆమె అన్నారు. హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి వచ్చి ఈ కుటుంబానికి ఇల్లు కట్టించేవరకు.. ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీలకు సోయి లేదా అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.