ఇంకా ప్రారంభం కాని వడ్ల కొనుగోలు కేంద్రాలు

ఇంకా ప్రారంభం కాని వడ్ల కొనుగోలు కేంద్రాలు
  • ఉమ్మడి జిల్లాలో 741 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

  • సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా..

  • కేంద్రాల ప్రారంభంలో ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు.. 

నాగర్​కర్నూల్, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో  ఆలస్యం జరుగుతుండడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని మొక్కుబడిగా స్టేట్​మెంట్లు ఇస్తున్నారే తప్పా.. ఆచరణలో ఆలస్యమవుతుందని రైతులు వాపోతున్నారు. వరికోతలు షురూ అయినా నాగర్ కర్నూల్ జిల్లాలో 3.66 లక్షల మెట్రిక్​టన్నుల వడ్లు  కొనేందుకు 222 కేంద్రాలు ప్రతిపాదించినా..  ఇంకా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలేదు.  జోగులాంబ గద్వాల జిల్లాలో2.45లక్షల మెట్రిక్​టన్నుల వడ్లు కొనేందుకు 71 సెంటర్లు ప్రతిపాదించినా ఇంకా స్టార్ట్ చేయలేదు. నారాయణపేట జిల్లాలో 3.16 లక్షల మెట్రిక్ టన్నుల  వడ్లు కొనేందుకు  137 సెంటర్లు ప్రతిపాదించారు కానీ.. ఇంకా  ప్రారంభించలేదు. మహబూబ్​నగర్​, వనపర్తి జిల్లాలో కొన్ని కేంద్రాలు ప్రారంభించారు.

సమావేశాలకే పరిమితం..

సివిల్ సప్లై  డిపార్ట్​మెంట్​ ద్వారా సింగిల్​విండో, ఐకేపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసే  వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కొనుగోలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిసారి సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. ట్రాన్స్​పోర్ట్​, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, 
తేమ శాతం కొలిచే యంత్రాలు, హమాలీ చార్జీల చెల్లింపు వంటి అంశాలపై అధికారులు సూచనలు విన్నట్లే  ఉన్నా ఆచరణలో  కనిపించడం లేదు. గత సీజన్​లలో వర్షాలకు వడ్లు తడిసి పోయి, కొట్టుకుపోతే  రైతులు నెత్తినోరు కొట్టుకున్నా టార్పాలిన్ కవర్లు ఇచ్చిన పాపానపోలేదు. హమాలీ డబ్బులు  ఇవ్వాలని ఉన్నా‘ కేంద్రం ఇవ్వలేదు. మేమివ్వం’ అని రైతుల నెత్తిన రుద్దుతున్నారు. కోతలు మొదలై ధాన్యం ఆరబోసుకుని తెచ్చినా 14శాతం తేమ ఉన్నా ఎక్కువ  ఉందని, రాళ్లు, రప్పలు, తాలు ఉందన్న సాకుతో రేట్లలో అడ్డగోలుగా కటింగ్ పెట్టిన సందర్భాలు ఎన్నో.

దళారులే బాగుపడుతున్నరు..

ఈ యాసంగి, గత వానాకాలం అనుభవాలను చూస్తే వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చోటుచేసుకున్న నిర్లక్షం, ఆలస్యం  వల్ల రైతులు  కల్లాల్లోనే నుంచే వడ్లు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. ఆ రెండు సీజన్​లో అకాల వర్షాల భయంతో రైతులు వచ్చిన కాడికి.. ఇచ్చిన కాడికి అన్నట్లు  అమ్ముకుని నష్టపోయారు. రైతులు అమ్ముకున్న 25 రోజుల తర్వాత  వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లే  రైతులు తమ పంట దిగుబడి వివరాలు చెప్పినా.. గన్నీ బ్యాగులు, లారీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కల్పించారు. సెంటర్ల ప్రారంభించడంలో జరిగే ఆలస్యంతో మధ్య దళారులు బాగుపడుతున్నారు.

పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి..

వరి ఎక్కువగా సాగు చేసే నాగర్​కర్నూల్​, బిజినేపల్లి, తెల్కపల్లి, తిమ్మాజీపేట, కల్వకుర్తి, ఉప్పునుంతల, కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, వంగూరు, అచ్చంపేట, ఇతర మండలాల్లో వడ్ల కొనుగోలు పెద్ద పైరవీ వ్యవహారంలా  తయారవుతోంది. గోనె సంచులు, ట్రక్ షీట్ల కోసం లీడర్లను అడుక్కోవాల్సిన పరిస్థితి.  కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడంలో ఆలస్యం చేసే జిల్లా అధికారులు  వడ్ల కొనుగోలు టైంలో రైతుల కంటే దళారులే ముందుంటారనే విషయం బహిరంగ రహస్యమే   అయినా.. పట్టించుకునే  విజిలెన్స్ మానిటరింగ్ లేకుండా పోయింది. వరికోతలు ఆలస్యమవుతున్నాయనే  సాకును చూపించే  ఆఫీసర్లు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, హమాలీ, ట్రాన్స్​పోర్ట్​ చెల్లింపుల విషయంలో ఈ సారైనా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారో లేదో చూడాలి.    

త్వరలో స్టార్ట్ చేస్తాం..

నాగర్ కర్నూల్ జిల్లాలో వానాకాలం వరి కొనుగోలుకు 222సెంటర్లు ప్రపోజ్ చేసినం. అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్​మెంట్లు, మిల్లర్లు, ట్రాన్స్​పోర్టు  ఏజెన్సీ తో మీటింగ్ పెట్టినం. త్వరలో సెంటర్లు స్టార్ట్ చేస్తం. – బాలరాజు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్