
- హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
- సదర్ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్’ అంటూ యాదవ సోదరుల నమ్మకాన్ని కొనియాడారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఈ ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి, నిధులు కూడా అందిస్తున్నట్లు చెప్పారు.
‘‘సంక్షేమంలోనూ, రాజకీయాల్లోనూ యాదవులకు సముచిత స్థానం కల్పిస్తాం. కొన్నిసార్లు ఆలస్యమైనా సరే.. అవకాశాలు కల్పించి గౌరవిస్తాం. యాదవ సోదరులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం వద్దకు రావాలి. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల సహకారం ఎంతో అవసరం. వారి సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవంలో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పలువురు యాదవ సంఘాలు నేతలు పాల్గొన్నారు.