
హైదరాబాద్, వెలుగు: సందేశాత్మక రచనలు, ఆటాపాటలతో సమాజం జాగృతమవుతుందని, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి మోగించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సమాజంలో రుగ్మతలకు విరుగుడుగా సాహిత్యం, కళారూపాల ద్వారా చైతన్యం పెంపొందించాలన్న లక్ష్యంతో ఆదివారం రవీంద్రభారతీలో భాషా, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ‘ప్రభాత భేరి’ తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఆనాటి సాంఘిక దురాచారాల మాదిరిగానే.. నేటి ఆధునిక పోకడల మాటున కొత్త సామాజిక రుగ్మతలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. పెండ్లిలు, పేరంటాలకు అనవసరపు ఖర్చులు తగ్గించండి. సెల్ ఫోన్లకు బానిసలై, సోషల్ మీడియాలో మునిగి పోవడం, లిక్కర్, డ్రగ్స్, ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారు’ ఆయన పేర్కొన్నారు.
ఈ తరహా సామాజిక రుగ్మతలపై సాహితీవేత్తలు, కవులు, కళాకారులు పోరాటం ప్రారంభించాలని, ప్రభాత భేరి మోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాలా, సినీ దర్శకుడు నర్సింగరావు, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.