బీహార్‌లోని బోధ్ గయలో జరిగిన ఒక పెళ్లిలో రసగుల్లాలు సరిపోకపోవడం పెద్ద గొడవకు దారి తీసింది. పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాల మధ్య మాటల యుద్ధం కాస్తా కొట్లాటగా మారింది. ఈ మొత్తం సంఘటన పెళ్లి జరిగిన హోటల్‌లోని సీసీటీవీలో రికార్డైంది.
ఏం జరిగిందంటే: పెళ్లి విందులో రసగుల్లాలు అయిపోవడంతో మొదలైన చిన్న మాటల వివాదం పెరిగి పెద్దదైంది. దింతో రెండు కుటుంబాలు ఒకరిపై పై ఒకరు కుర్చీలు విసురుకుంటూ.. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణ కారణంగా పెళ్లి కూడా ఆగిపోయినట్లు సమాచారం.
నవంబర్ 29న జరిగిన ఈ సంఘటన సమయంలో వధూవరులు పెళ్లి మండపానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. గొడవ తర్వాత వధువు కుటుంబికులు వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ ఘటనపై ఇంకా ఎవరినీ అరెస్టు చేయకపోగా.. పోలీసులు కూడా స్పందించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. రిబ్బన్ కట్ వేడుక సందర్భంగా గొడవ జరగడంతో వధువు పెళ్లిని క్యాన్సల్ చేసుకొని పెళ్లి ఊరేగింపును వెనక్కి పంపింది. ఈ గొడవకు కారణం ఏంటంటే, వరుడి స్నేహితులు రిబ్బన్ కట్ సమయంలో వధువు బంధువులపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు వైపుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి, అది కాస్తా కొట్లాటగా మారి కొట్టుకునేదాకా వెళ్లింది.
