కేరళ వెళ్లాల్సిన విమానాలు రద్దు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్ప భక్తుల ఆందోళన

కేరళ వెళ్లాల్సిన విమానాలు రద్దు..  శంషాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో విమానాల రద్దు శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం ( డిసెంబర్ 4 ) శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు 30కి పైగా రద్దవ్వడంతో విమానాశ్రయానికి పరిమితమయ్యారు ప్రయాణికులు. కేరళకు వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దవ్వడంతో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో ఆందోళన చేపట్టారు అయ్యప్ప భక్తులు.

ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులను ఇలా సమాచారం ఇవ్వకుండా వెయిట్ చేయించడం సరికాదని.. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి శబరిమల వెళ్లేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు అయ్యప్ప భక్తులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్స్ రద్దు చేసి తమను ఇబ్బందికి గురి చేసిన ఇండిగో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప భక్తులు.

ఇదిలా ఉండగా.. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో. హైదరాబాద్ లో కూడా 33 విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో. ముంబై ఎయిర్ పోర్టులో నుంచి 170కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల నుంచి 200 విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో.

రోజుకు దాదాపు 2 వేల 200 విమానాలను నడుపుతున్న ఇండిగో సాంకేతిక లోపం కారణంగా పలు సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఇందుకు గాను కస్టమర్లకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది ఇండిగో.