
సూర్యపేట, వెలుగు: అక్టోబర్ 25న హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి యాదాద్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు డి.ఇ.ఇ.టి, సింగరేణి కాలరీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు సమాచారం అందించే విషయం ఈ జాబ్ మేళాలో అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నుంచి 150 కంపెనీల వరకు ఈ జాబ్ మేళాకు తరలి వస్తున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిశ్రమలు కూడా జాబ్ మేళాలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 21 న హుజుర్ నగర్ లో పర్యటించడంతో పాటు 22 న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట, వెలుగు: ఈ నెల 25న హజుర్‌నగర్ కేంద్రంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో హుజూర్‌నగర్ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మెగా జాబ్ మేళా పై విస్తృత ప్రచారం
హుజూర్ నగర్, వెలుగు: ఈ నెల 25న హుజూర్ నగర్ లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల యువతకు అవకాశం కల్పించేలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాబ్ మేళాను నిర్వహిస్తున్నారన్నారు.
అధికారులందరూ జాబ్ మేళా పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారాములు, అధికారులు పాల్గొన్నారు.