ఆర్ధిక ఇబ్బందులతో కూతుర్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని.. తండ్రిని కొట్టి చంపారు

ఆర్ధిక ఇబ్బందులతో కూతుర్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని..  తండ్రిని కొట్టి చంపారు

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం
ఆర్థిక ఇబ్బందులతో బిడ్డను బంధువుల ఇంటికి పంపిద్దామనుకున్న బాధితుడు

లక్నో: ఓ వ్యక్తి తన టీనేజ్ కూతురును అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలతో కొంతమంది అతడిని కొట్టి చంపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సర్వేశ్ కుమార్ దివాకర్ (45) దళితుడు. ఆయనొక ఫుడ్ స్టాల్ నడిపిస్తున్నాడు. లాక్ డౌన్ తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సర్వేశ్ .. తన 16 ఏండ్ల కూతురును నోయిడాలోని బంధువుల ఇంటికి పంపిద్దామని డిసైడ్ అయ్యాడు. అయితే ఆయన తన కూతుర్ని అమ్ముతున్నాడని లోకల్ గా ప్రచారం జరిగింది. ఈ కారణంతో కొంతమంది ఆదివారం ఆయనపై దాడిచేశారు. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలైన సర్వేశ్​ను హాస్పిటల్ లో చేర్పించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం చనిపోయాడు. సర్వేశ్​ను దుండగులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం ఐదుగురు కలిసి కొట్టారని, ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్ర సర్కార్ పై ఎస్పీ, బీఎస్పీ మండిపడ్డాయి. బజరంగ్దళ్ గూండాలే సర్వేశ్​ను చంపారని ఎస్పీ ఆరోపించింది. బాధితుడి ఫ్యామిలీకి రూ.లక్ష అందజేస్తామని ప్రకటించిన ఎస్పీ.. ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, బాధితుడి ఫ్యామిలీకి న్యాయం చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి కోరారు.