ప్రేమికులు ఇంట్లో ఉండగా వచ్చిన తండ్రి... తప్పించుకునే ప్రయత్నంలో యువతి మృతి

ప్రేమికులు ఇంట్లో ఉండగా వచ్చిన తండ్రి... తప్పించుకునే ప్రయత్నంలో యువతి మృతి
  • సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్‌‌బెడ్రూం ఇండ్ల వద్ద ఘటన

రామచంద్రాపురం, వెలుగు : ప్రేమికులు ఇంట్లో ఉన్న టైంలో సడన్‌‌గా యువతి తండ్రి రాగా.. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎనిమిదో అంతస్తు నుంచి పడి యువతి చనిపోయింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్‌‌ బెడ్రూంల వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌‌లోని పాతబస్తీ కోమటివాడకు చెందిన సయ్యద్‌‌ అలాందార్‌‌ కుటుంబానికి కొల్లూరు డబుల్‌‌ బెడ్రూం ఫేజ్‌‌ 1లోని 40వ బ్లాక్‌‌ ఎనిమిదో అంతస్తులో ఇల్లు మంజూరైంది. కానీ వారు అక్కడికి షిఫ్ట్‌‌ కాకపోవడంతో ఇల్లు ఖాళీగా ఉంది. అలాందార్‌‌ కుమార్తె సకిన ఫాతిమా (20)కు చార్మినార్‌‌కు చెందిన మీర్‌‌ హుస్సేన్‌‌ అలీఖాన్‌‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. గురువారం ఫాతిమా, హుస్సేన్‌‌ కలిసి కొల్లూర్‌‌లోని డబుల్‌‌ బెడ్రూమ్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌లోని ఇంటికి వచ్చారు. 

ఇదే టైంలో ఇంటిని చూసేందుకు ఫాతిమా తండ్రి అలాందార్‌‌ సైతం ఫ్లాట్‌‌ వద్దకు వచ్చాడు. డోర్‌‌ తెరవడానికి ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి కనిపించింది. దీంతో ఇంట్లో ఎవరో ఉన్నారని గ్రహించిన అతడు చుట్టుపక్కల వారిని పిలిచాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఫాతిమా, హుస్సేన్‌‌ తమ ఫ్లాట్‌‌ బాల్కనీ నుంచి పక్కింటి బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫాతిమా పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. ఫాతిమా తండ్రి అలాందార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.