ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు!

ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు!

చర్ల, వెలుగురెండో సారి కూడా ఆడపిల్ల పుట్టిందని తండ్రి ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నాడు. రెండు నెలల తరువాత ఓ రోజు తెల్లవారుజామున తల్లి బయటకు వెళ్లి వచ్చేసరికి ఆ చిన్నారి నీటితొట్టిలో శవమైకనిపించింది. తండ్రే పాప ప్రాణాలు బలిగొన్నాడని తల్లి, బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో ఈ దారుణం చోటుచేసుకుంది. సి కత్తిగూడెంకు చెందిన అడబాల సూర్యతేజ, రేగుంటకు చెందిన అఖిల రెండేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సూర్యతేజ కుటుంబం ఒప్పుకోకపోవడంతో…  అమ్మాయి గ్రామంలో ఉంటున్నారు. సూర్యతేజ కారు డ్రైవర్‌‌గా, అఖిల కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రెండో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించడంతో  దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. వీరికి తొలుత ఆడపిల్ల జన్మించింది. రెండు నెలల క్రిండం రెండో కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని సూర్యతేజ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలతో అఖిల నిద్రిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అఖిల బయటకు వెళ్లి వచ్చేసరికి తనపక్కలో ఉన్న చిన్న పాప కనిపించక పోవడంతో భర్తను లేపి అడిగింది. తను కూడా తెలియదని చెప్పడంతో ఇద్దరు కలిసి వెతికారు. విషయం తెలిసిన ఇరుగుపొరుగు కూడా వెతకడం ప్రారంభించారు. కొంత సేపటికి ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో చిన్నారి శవం కన్పించింది. దీంతో అఖిల రోదనలు మిన్నంటాయి. ముందునుంచి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తన భర్తే.. కూతురిని చంపేశాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సూర్యతేజను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.