
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ టీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నికలో పాలుపంచుకున్న నాయకులకు ఢిల్లీకి రావాలని పిలుపువచ్చింది. ఓటమి గల కారణాలను కేసీ వేణుగోపాల్ అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వి. హనుమంతరావు, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి, అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు రావడంపై ప్రధానంగా చర్చించారు. దేశంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించగా.. హుజూరాబాద్ బైపోల్‌లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. దాంతో రాష్ట్ర నాయకులపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. టీఆర్ఎస్ బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ఆడుతున్నాయన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వార్ రూంలో మొదటి రౌండ్ సమావేశం ముగిసిందని ఆయన చెప్పారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.... నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఒక్కొక్కరితో వేణుగోపాల్ విడిడిగా చర్చిస్తారని మాణిక్కం ఠాగూర్ చెప్పారు.